బ్రిటీష్ రాచకుటుంబానికి ఏడాదికి ఎంత ఖర్చు..? 20 ఏళ్ల క్రితం ఎలిజబెత్ రాణి తల్లి అంత్యక్రియలకు ఎన్ని కోట్ల ఖర్చయిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-19T21:31:33+05:30 IST

ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

బ్రిటీష్ రాచకుటుంబానికి ఏడాదికి ఎంత ఖర్చు..? 20 ఏళ్ల క్రితం ఎలిజబెత్ రాణి తల్లి అంత్యక్రియలకు ఎన్ని కోట్ల ఖర్చయిందో తెలిస్తే..

ఇటీవల మరణించిన బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ అంత్యక్రియల కోసం వివిధ దేశాధినేతలు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఒకవైపు మహారాణి మరణానికి వేల మంది సంతాపం తెలుపుతుంటే.. మరోవైపు రాజరికానికి వ్యతిరేకంగా కొందరు గళమెత్తుతున్నారు. ఎలిజబెత్-2 తర్వాత గద్దెనెక్కనున్న ప్రిన్స్ ఛార్లెస్‌ను రాజుగా గుర్తించబోమంటూ సోషల్ మీడియాలో `not my king` హ్యాష్‌ట్యాగ్ హోరెత్తుతోంది. రాజరికాన్ని రద్దు చేయాలని యువకులు నినాదాలు చేస్తున్నారు. ఈ డిమాండ్ వెనకున్న కారణాలు ఏంటంటే.. 


`బ్లూమ్‌బర్గ్` ఈ ఏడాది జూన్‌లో వెలువరించిన నివేదిక ప్రకారం.. 2021-22 ఏడాదికి గాను బ్రిటన్ రాజకుటుంబం ఖర్చులు 102.4 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ.940 కోట్లు). బ్రిటన్‌లో రాజకుటుంబం కోసం ఖర్చు పెట్టడాన్ని సావరిన్ గ్రాంట్ (sovereign grant) అంటారు. ఈ గ్రాంట్ కోసం బ్రిటన్‌లోని ప్రతి పౌరుడు రూ.120 భరించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి రాజకుటుంబీకుల విలాసాలకు, విహార యాత్రలకు ఖర్చు పెడుతున్నారని, వెంటనే రాజరికాన్ని రద్దు చేయాలని చాలా మంది యువకులు సోషల్ మీడియా ద్వారా డిమండ్ చేస్తున్నారు. 


క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల కోసం బ్రిటన్ ప్రభుత్వం 9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) వెచ్చించనున్నట్టు సమాచారం. ఈ ఖర్చు ఎంతనేది బ్రిటన్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే 2002లో క్వీన్ ఎలిజబెత్-2 తల్లి చనిపోయినపుడు.. అంత్యక్రియల కోసం 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.40 కోట్లు) ఖర్చు పెట్టారు. ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆ ఖర్చు దాదాపు డబుల్ అవుతుందని తెలుస్తోంది. ఇక, బ్రిటన్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తి రూ. 30 కోట్లకు మించిన తన ఆస్తిని వారసులకు ఇవ్వాలంటే దాంట్లో 40 శాతం పన్ను కట్టాలి. అదే, కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తిని తల్లి నుంచి స్వీకరించనున్న ప్రిన్స్ ఛార్లెస్ ఒక్క రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ఈ చట్టాన్ని కూడా మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-09-19T21:31:33+05:30 IST