Viral News: ల్యాప్‌టాప్‌తోపాటు ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు.. షాకిచ్చిన కండక్టర్.. అదనంగా రూ.10వసూలు!

ABN , First Publish Date - 2022-11-11T10:12:55+05:30 IST

బస్సు కండక్టర్ షాకిచ్చాడు. యువకుడి వద్ద ల్యాప్‌టాప్ ఉన్న విషయాన్ని గమనించి.. అదనంగా అతడి వద్ద నుంచి రూ.10 వసూలు చేశాడు. అదికాస్తా మీడియా దృష్టికి రావడంతో.. ప్రస్తుతం ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా..

Viral News: ల్యాప్‌టాప్‌తోపాటు ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడు.. షాకిచ్చిన కండక్టర్.. అదనంగా రూ.10వసూలు!

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు రవాణా సంస్థ(RTC).. తక్కువ ఖర్చుతో ప్రయాణికులను క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించడానికి మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కూడా తాజాగా ఓ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బస్సెక్కాడు. అయితే అతడికి సదరు బస్సు కండక్టర్ షాకిచ్చాడు. యువకుడి వద్ద ల్యాప్‌టాప్ ఉన్న విషయాన్ని గమనించి.. అదనంగా అతడి వద్ద నుంచి రూ.10 వసూలు చేశాడు. అదికాస్తా మీడియా దృష్టికి రావడంతో.. ప్రస్తుతం ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఘటన తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు గడగ్ నుంచి హూబ్లీకి వెళ్లేందుకు NWKRTC(నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్) బస్సులో బయల్దేరాడు. బస్సు ఎక్కగానే టికెట్ తీసుకుని వెళ్లి సీట్లో కూర్చున్నాడు. అనంతరం ఓ పని మీద బ్యాగులో ఉన్న ల్యాప్‌టాప్‌ను బయటికి తీసి, దాన్ని ఓపెన్ చేశాడు. అది చూసిన కండక్టర్.. వెంటనే అతడి వద్దకు వచ్చి.. ల్యాప్‌టాప్‌ క్యారీ చేస్తున్నందు వల్ల అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అది విని సదరు ప్రయాణికుడు షాకయ్యాడు. అంతేకాకుండా ల్యాప్‌టాప్ క్యారీ చేసినంత మాత్రాన అదనంగా ఎందుకు చెల్లించాలి అని కండక్టర్‌ను ప్రశ్నించాడు. దీంతో బదులిచ్చిన కండక్టర్.. కర్ణాటక స్టేట్ ఆర్టీసీ తాజాగా లగేజ్ రూల్స్‌ను సవరించిందని.. ఆ నిబంధనలు NWKRTC కూడా వర్తిస్తాయని చెబుతూ అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీని ప్రయాణికుడికి చూపించాడు. అది చూసి తర్వాత ఇక ఏం చేయలేక సదరు ప్రయాణికుడు రూ.10 అదనంగా చెల్లించాడు.

అనంతరం తనకు కలిగిన అసౌకర్యాన్ని స్థానిక మీడియాతో పంచుకున్నాడు. ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా.. దాదాపు 30కేజీల బరువు ఉన్న లగేజీ ప్రయాణికుడు తనతో క్యారీ చేసే సౌకర్యాన్ని కర్ణాటక ఆర్టీసీ కల్పించిందని చెప్పాడు. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఉచిత బ్యాగేజీ అలవెన్సుల జాబితాలో ల్యాప్‌టాప్‌ మిస్ అయిందని పేర్కొన్నాడు. అందువల్ల తాను రూ.10 అదనంగా చెల్లించాల్సి వచ్చిందని వివరించాడు. కాగా.. ఈ ఘటనపై ఆర్టీసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ల్యాప్‌టాప్‌ను క్యారీ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీవీలు, ఫ్రీజ్‌లు, డెస్క్‌టాప్‌ వంటి ఎలక్ట్రిక్ పరికరాలకు వాటి సంఖ్య, దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ల్యాప్‌టాప్ కూడా సెల్‌ఫోన్‌ కేటగిరీ కింద పరిగణించడం వల్ల దానికి అదనపు చార్జీ వసూలు చేయడానికి వీలు లేదన్నారు.

Updated Date - 2022-11-11T10:32:49+05:30 IST