Uttar Pradesh: పెళ్లి ఊరేగింపునకు 60 మంది పోలీసుల భద్రత.. వారేం సెలబ్రిటీలు కాదు.. అయినా అంత సెక్యూరిటీ ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-11-28T20:48:54+05:30 IST

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కుల వివక్ష తగ్గడం లేదు.. కులాంతర వివాహాలను పెద్దలు మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు.. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో ఈ కుల వివక్ష మరింతగా విజృంభిస్తోంది.

Uttar Pradesh: పెళ్లి ఊరేగింపునకు 60 మంది పోలీసుల భద్రత.. వారేం సెలబ్రిటీలు కాదు.. అయినా అంత సెక్యూరిటీ ఎందుకో తెలిస్తే షాక్!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా కుల వివక్ష తగ్గడం లేదు.. కులాంతర వివాహాలను పెద్దలు మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు.. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో ఈ కుల వివక్ష మరింతగా విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్‌ ప్రాంతంలోని లోహమై గ్రామంలో రవీనా , రామ్‌కిషన్ అనే ఇద్దరు ప్రేమికులు వివాహం చేసుకున్నారు. రవీనా దళితురాలు కాగా, రామ్‌కిషన్ అగ్రకులానికి చెందిన వాడు.

దళితురాలితో వివాహానికి రామ్‌కిషన్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా రామ్‌కిషన్ తన తల్లిదండ్రులను ఎదురించి వివాహానికి సిద్ధమయ్యాడు. దీంతో వధువు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలో అగ్ర కులస్థులు ఎక్కువ కాబట్టి వారి నుంచి తమ కూతురి వివాహానికి, ఊరేగింపునకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వధువు తండ్రి లేఖ రాశారు. వెంటనే స్పందించిన ఎస్పీ ఆ వివాహానికి రక్షణ కల్పించాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు. దీంతో 44 మంది కానిస్టేబుళ్లు, 14 మంది ఎస్‌ఐలు సహా మొత్తం 60 మంది ఆ వివాహానికి బందోబస్తుగా వచ్చారు.

అమ్మాయి కుటుంబ సభ్యులపై అబ్బాయి తరపు బంధువులు దాడి చేయకుండా జాగ్రత్తగా పెళ్లి జరిపించారు. పెళ్లి తర్వాత నూతన దంపతుల్ని గుర్రంపై ఊరేగిస్తూ డీజే మ్యూజిక్‌‌కు అనుగుణంగా డ్యాన్సులు కూడా చేశారు. పోలీసు సిబ్బంది అంతా కలిసి డబ్బులు సేకరించి 11వేల రూపాయలను వధూవరులకు కానుకగా అందజేశారు.

Updated Date - 2022-11-28T20:49:00+05:30 IST