ఎడారి దేశంలో దయనీయ స్థితిలో తెలుగు మహిళ.. చంటి బిడ్డను ఎత్తుకుని పడరాని పాట్లు

ABN , First Publish Date - 2022-10-07T00:11:02+05:30 IST

సందర్శక వీసాలు.. ప్రస్తుతం విరివిగా జారీ అవుతున్నాయి. ఈ విజిటింగ్ వీసాలతో అనేక మంది ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు రప్పించుకుని సంబరపడుతున్నారు. సాధారణంగా.. విజిట్ వీసాల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఏడాది పూర్తయేలోపు ఈ వీసాలపై వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సౌదీలో ఉన్న భార్య/భర్తలను చూసేందుకు తమ

ఎడారి దేశంలో దయనీయ స్థితిలో తెలుగు మహిళ.. చంటి బిడ్డను ఎత్తుకుని పడరాని పాట్లు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సందర్శక వీసాలు.. ప్రస్తుతం విరివిగా జారీ అవుతున్నాయి. ఈ విజిటింగ్ వీసాలతో అనేక మంది ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు రప్పించుకుని సంబరపడుతున్నారు. సాధారణంగా.. విజిట్ వీసాల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఏడాది పూర్తయేలోపు ఈ వీసాలపై వచ్చిన వారు తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. సౌదీలో ఉన్న భార్య/భర్తలను చూసేందుకు తమ జీవిత భాగస్వాములు కూడా ఇలా విజిట్ వీసాలపై వస్తుండటం.. ఇక్కడే కొన్నాళ్ల పాటు ఉండి తిరిగి వెళ్తుండటం అన్నది ప్రవాస భారతీయుల్లో సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలాగే సౌదీలో పని చేస్తున్న భార్య.. ఇండియాలో ఉన్న తన భర్తను చూడాలనుకుంది. విజిట్ వీసాపై రప్పించుకుంది. అనంతరం ఆ భార్యభర్తలు సంతోషంగా కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ భార్య గర్భం దాల్చింది. ఆ తర్వాత అక్కడే ఆమెకు ప్రసవం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తనకు పుట్టిన ఆ బాబును స్వదేశానికి తీసుకురావడానికి నానా అవస్థలు పడుతోంది. ఈ సమస్య కేవలం ఆమె ఒక్కరికే పరిమితం కాలేదు. విజిట్ వీసాలపై సౌదీలో ఉన్న భర్తల వద్దకు వచ్చి.. పిల్లలకు జన్మనిచ్చిన అనేక మంది మహిళలు ఈ కష్టాలను ఎదుర్కొంటున్నారు. 


పరాయి దేశం నుంచి తన బిడ్డతో కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఒక మాతృమూర్తి ఎదుర్కోనే అవరోధాలను ప్రఖ్యాత అమెరికన్ నవల రచయిత విలియం హోఫర్ ఒక వాస్తవ కథాంశంగా వివరించిన తీరు ఒకప్పుడు పాఠకులను కన్నీరు పెట్టించగా ఇప్పుడు... సౌదీ అరేబియాలో ఒక తెలుగు మహిళ తన బిడ్డతో కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లడానికి పడుతున్న కష్టాలు మనస్సును కలచివేస్తోంది.


సౌదీ అరేబియాలోని తబూక్ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల ఎడారి గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆసుపత్రిలో విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. ఆమె తన భర్తను ఒక సంవత్సరం గడువు కల్గిన సందర్శక వీసాపై సౌదీకి రప్పించుకుంది. అనంతరం భర్తతో కలిసి సంతోషంగా జీవించింది. ఈ క్రమంలోనే ఆమె గర్భందాల్చి బాబుకు కూడా జన్మనిచ్చింది. పుట్టిన బాబుకు జనన సర్టిఫికెట్ కోసం గత రెండున్నర నెలలుగా అమె శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే.. ఆసియా దేశాలకు చెందిన పౌరుల జనన సర్టిఫికెట్లలో అరబ్బీ భాషతో పాటు విధిగా ఆంగ్లంలో కూడా పేరును పొందుపర్చాలనే నిబంధన అక్కడ అమలులో ఉంది. ఈ క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అమెకు పుట్టిన బిడ్డకు సర్టిఫికెట్ జారీ కావడంలో ఆలస్యం జరుగుతుంది. దీంతో అమె గత రెండున్నర నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి అధికారులు జారీ చేసే జనన సర్టిఫికెట్ లేనిదే అమెకు బిడ్డను భారతీయుడిగా భారతీయ కౌన్సలేటు లేదా ఎంబసీ గుర్తించదు. అలా గుర్తించకపోతే పుట్టిన బిడ్డకు పాస్ పోర్టు జారీ కాదు. ఈ క్రమంలోనే తాను నివాసం ఉంటున్న గ్రామం నుంచి 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న తబూక్, అలాగే 900 కిలో మీటర్ల దూరంలో ఉన్న జెద్దాకు వెళ్లి అక్కడి అధికారులను ప్రాధేయపడుతోంది. 



మరో వైపు భర్త వీసా గడువు దగ్గరపడింది. విజిట్ వీసా గడువు పొడిగించడానికి ఆవకాశం లేదు. వీసా గడువు ముగిసి భర్త ఇండియాకు తిరిగొస్తే.. తన బిడ్డ ఆలనాపాలనా ఎవరు చూస్తారనే ఆందోళనతో సహాయం కొరకు ఆమె అభ్యర్ధించని చోటు అంటూ లేదు. అయితే.. అమె కష్టాలను తెలుసుకొన్న ఒక తెలుగు ప్రవాసీయుడు రియాధ్‌లోని సౌదీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్ధితుల్లో సంబంధిత రాష్ట్రం నుంచి కాకుండ నేరుగా రియాధ్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి ఆమె బిడ్డకు జనన సర్టిఫికెట్‌ను జారీ చేయించారు. దీంతోపాటు జెద్ధాలోని భారతీయ కాన్సులేటు అధికారుల దృష్టికి ఆమె సమస్యను తీసుకెళ్లి.. పుట్టిన బిడ్డకు పాస్ పోర్టు కూడా జారీ అయ్యేలా చేశారు. కాన్సులర్ విభాగం అధికారులు కూడ అమె పరిస్ధితి చూసి చలించి పోయారు. బిడ్డకు పాస్‌పోర్ట్ జారీ చేయడంలో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. నిబంధనల ప్రకారం విదేశాలలో జన్మించే శిశువుల వివరాలను న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతీయ దౌత్య కార్యాలయాల ద్వార నమోదు చేస్తుంది. సౌదీ అధికారులు జారీ చేసిన జనన సర్టిఫికెట్ఃను, భారతీయ అధికారులు జారీ చేసిన పాస్ పోర్టును, సౌదీ ఇమ్మిగ్రేషన్ (జవజాత్) అధికారులు నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పుట్టిన పసిగుడ్డు దేశం దాటడానికి వీలవుతుంది.


 అయితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇంతలో ఆమె భర్త వీసా గడువు ముగిసింది. దీంతో అతను బుధవారం తన భార్య, బిడ్డను వదిలి దుఖంతో విజయవాడకు తిరుగు పయనం అయ్యాడు. గురువారం ఉదయం సదరు మహిళ అఖమాలో పుట్టిన బిడ్డ వివరాలను తబూక్‌లోని జవజాత్ అధికారులు చేర్చారు. దయనీయ స్ధితిలో ఉన్న ఆ మహిళ తన బిడ్డతో సహా ఇండియాకు చేరుకోవడానికి రియాధ్‌లోని సామాజిక సేవకుడు ఒంగోలుకు చెందిన ముజమ్మీల్ (0556473503)కూడ తన వంతుగా సహాయం చేశారు. ప్రస్తుతం ఆమె విజయవాడకు బయల్దేరడానికి రెడీగా ఉంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ముజమ్మీల్, జెద్ధాలోని భారతీయ కాన్సులేటు అధికారులకు, రియాధ్‌లోని జనన మరణాల నమోదు అధికారులకు, తబూక్‌లోని పాస్ పోర్టు అధికారులకు, సామాజిక కార్యకర్తలకు ఈ సందర్భంగా అమె కృతజ్ఞతలు తెలిపింది. కాగా.. విజయవాడకు చెందిన మహిళ సమస్య పరిష్కారం అయినప్పటికీ.. ఆమెలాగే ఇంకా ఎంతో మంది మహిళలు సౌదీలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


Updated Date - 2022-10-07T00:11:02+05:30 IST