NRI: అమెరికాలో నివసించే వారికి ఓ హెచ్చరిక.. వచ్చే ఏడాది నుంచీ..

ABN , First Publish Date - 2022-10-11T23:30:57+05:30 IST

అమెరికాలో ద్రవ్యోల్బణ(Inflation) కట్టడికి ఫెడరల్ బ్యాంకు( అమెరికా సెంట్రల్ బ్యాంకు) తీసుకుంటున్న చర్యలు ఉద్యోగాల కల్పనపై ప్రతికూల ప్రభావం చూపనుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజాగా హెచ్చరించింది.

NRI: అమెరికాలో నివసించే వారికి ఓ హెచ్చరిక.. వచ్చే ఏడాది నుంచీ..

ఎన్నారై డెస్క్: అమెరికాలో ద్రవ్యోల్బణ(Inflation) కట్టడికి ఫెడరల్ రిజర్వ్ ( అమెరికా సెంట్రల్ బ్యాంకు) తీసుకుంటున్న చర్యలు.. ఉద్యోగాల కల్పనపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాలో వస్తుసేవలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్ల పెంపుతో దీనికి చెక్ పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ రంగంలోకి దిగింది. 


బ్యాంక్ ఆఫ్ అమెరికా(Bank Of America) అంచనా ప్రకారం.. ఉద్యోగకల్పనపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో  ఉద్యోగకల్పనలో వృద్ధి రేటు ఏకంగా సగానికి పడిపోతుంది. ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి నెలనెలా 1,75,000 ఉద్యోగావకాశాలు కనుమరుగవుతాయి. 2023 అంతా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని బ్యాంకు అంచనా వేస్తోంది. ‘‘ద్రవ్యోల్బణం కట్టడి చర్యలతో ఉద్యోగాలసృష్టిపై ప్రభావం పడకుండా ఉండేందుకు సాధారణంగా కేంద్ర బ్యాంకులు పటిష్ట చర్యలు తీసుకుంటాయి. ఈమారు ఫెడరల్ బ్యాంక్‌కు ఇది సాధ్యంకాకపోవచ్చు’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక అధికారి ఒకరు మీడియాకు వివరించారు. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతనెలలో అమెరికా ప్రజలకు కొత్తగా 2,63,000 ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగకల్పన రేటు కాస్తంత మందగించినా.. గతనెలలో మాత్రం మంచి గణాంకాలే నమోదయ్యాయి. అంతేకాకుండా.. నిరుద్యోగిత రేటు కూడా 3.5 శాతానికే పరిమితమైంది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం.. వచ్చే ఏడాది చివరికి అమెరికాలో నిరుద్యోగిత రేటు 5.5 శాతానికి ఎగబాకే అవకాశం ఉంది. ఇక.. అమెరికా జాబ్ మార్కెట్‌‌పై కొన్ని సానుకూల వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఉద్యగకల్పన రేటు కాస్త నెమ్మదించినప్పటికీ..ఉద్యోగాల సృష్టి మాత్రం కొనసాగుతూనే ఉంటుందని కాన్ఫరెన్స్ బోర్డు వ్యాఖ్యానించింది. 

Updated Date - 2022-10-11T23:30:57+05:30 IST