UAE Floods: యూఏఈలో అకాల వర్షాల బీభత్సం.. ఏడుగురు ఆసియా వాసులు మృతి

ABN , First Publish Date - 2022-07-30T14:19:16+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అకాల భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి.

UAE Floods: యూఏఈలో అకాల వర్షాల బీభత్సం.. ఏడుగురు ఆసియా వాసులు మృతి

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అకాల భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. పుజైరా (Fujairah), షార్జా (Sharjah), రాస్‌ అల్ ఖైమాల (Ras Al-Khaimah)లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. పుజైరాలో రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 25.5సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గడిచిన 27ఏళ్లలో యూఏఈలో ఈస్థాయి వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా పొటెత్తిన వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. రంగంలోకి దిగిన సైన్యం సుమారు 4వేల మందిని పునరవాస కేంద్రాలకు తరలించింది. 


ఇక వరదల కారణంగా ఏడుగురు ఆసియా ప్రవాసులు మృతిచెందినట్టు యూఏఈ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) శుక్రవారం వెల్లడించింది. మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డా. అలీ అల్ తునైజీ మీడియా మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లోని సుమారు 80 శాతం మందిని తిరిగి వారి ఇళ్లకు తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా యూఏఈ అధికారులు ప్రజలను హెచ్చరించారు. భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు దుబాయ్ (Dubai)‌, అబుదాబీ (Abu Dhabi) నగరాల్లో మాత్రం తేలికపాటి వర్షమే కురిసినట్లు తెలుస్తోంది.



Updated Date - 2022-07-30T14:19:16+05:30 IST