కెనడాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్తే ఊహించని ట్విస్ట్.. అచ్చం రవితేజ సినిమాలో జరిగినట్టుగానే..

ABN , First Publish Date - 2022-12-08T15:14:33+05:30 IST

మాస్ మహారాజ్ రవితేజ, నయనాతార జంటగా నటించిన దుబాయ్ శీను సినిమా గుర్తుందా? ఈ సినిమాలో రవితేజాతోపాటు అతడి స్నేహితులు దుబాయ్ వెళ్లేందుకని ముంబై వెళ్లి.. ట్రావెల్ ఏజెంట్‌గా పరిచయం అయిన వేణు మాధవ్ చేతిలో

కెనడాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్తే ఊహించని ట్విస్ట్.. అచ్చం రవితేజ సినిమాలో జరిగినట్టుగానే..

ఎన్నారై డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ, నయనాతార జంటగా నటించిన దుబాయ్ శీను సినిమా గుర్తుందా? ఈ సినిమాలో రవితేజాతోపాటు అతడి స్నేహితులు దుబాయ్ వెళ్లేందుకని ముంబై వెళ్లి.. ట్రావెల్ ఏజెంట్‌గా పరిచయం అయిన వేణు మాధవ్ చేతిలో తమ వద్ద ఉన్న మొత్తం డబ్బంతా పెట్టేస్తారు. ఆ తర్వాత ఫ్లైట్ టికెట్, వీసా తదితర ధ్రువీకరణ పత్రాల కోసం ట్రావెల్ ఆఫీస్‌కు వెళ్తేగాని తాము మోసపోయామనే విషయం వాళ్లకు అర్థం కాదు. అనంతరం ముంబైలో వాళ్లు పడ్డ పాట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆ సినిమాను ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే.. ఓ వ్యక్తి కూడా ఇంచు మించు ఇలానే మోసపోయాడు. అయితే.. ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాతే తాను మోసపోయాననే విషయం అతడికి అర్థం అయింది. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? అసలు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అతడి పేరు కుల్వీంద్రా సింగ్. హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఈయన.. కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురు ప్రీత్ సింగ్, కమల్ అనే వ్యక్తులను కలిశాడు. ఈ క్రమంలోనే 4-5నెలల్లో వీసా వచ్చేస్తుందని.. అయితే అందు కోసం రూ.12 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో కుల్వీంద్రా సింగ్ ఓకే చెప్పేశాడు. ఆ మొత్తాన్నీ సమకూర్చుకునే పనిలో పడిపోయాడు. అలా కొంత కాలం గడిచాక.. ఆ ఇద్దరూ మరోసారి కుల్వీంద్రా సింగ్‌ను కలిశారు. వీసా వచ్చేసిందని.. అయితే.. డబ్బులు చెల్లిస్తేనే దాన్ని చూపిస్తామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో కుల్వీంద్రా సింగ్.. విడతల వారీగా రూ.10లక్షలు వాళ్ల చేతిలో పెట్టాడు. వాళ్ల వద్ద నుంచి వీసా తీసుకుని.. కెనడాకు వెళ్లేందుకు రెడీ అయిపోయాడు.

ఈ నేపథ్యంలోనే అతడు బ్యాగులన్నీ ప్యాక్ చేసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయాడు. అయితే.. అక్కడికి వెళ్లాక అతడికి అసలు విషయం తెలిసింది. ఫ్లైట్ టికెట్ మినహా వీసాతోపాటు మిగిలిన డాక్యుమెంట్లు అన్నీ ఫేక్ అని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో ప్రస్తుతం పోలీసులను ఆశ్రయించాడు. గురు ప్రీత్ సింగ్, కమల్‌లపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-12-08T15:22:11+05:30 IST