సౌదీ సిబ్బంది పొరపాటు.. ఇండియాకు వచ్చిన రెండు మృతదేహాల తారుమారుతో గందరగోళం

ABN , First Publish Date - 2022-10-11T14:38:47+05:30 IST

సౌదీలో సిబ్బంది చేసిన ఓ పొరపాటు, రెండు మృతదేహాలను తారుమారు చేసింది.

సౌదీ సిబ్బంది పొరపాటు.. ఇండియాకు వచ్చిన రెండు మృతదేహాల తారుమారుతో గందరగోళం

శవపేటికల తారుమారు.. ఓ చోట అంత్యక్రియలూ!

భారత్‌కు ఇద్దరి మృతదేహాల తరలింపులో సౌదీ సిబ్బంది పొరపాటు

మృతదేహం తమవాడిది కాదని గుర్తించిన ముస్లిం కుటుంబ సభ్యులు 

అప్పటికే ఆలస్యం.. దానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు 

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సౌదీలో సిబ్బంది చేసిన ఓ పొరపాటు, రెండు మృతదేహాలను తారుమారు చేసింది. మృతదేహాన్ని తీసుకునేందుకు విమానాశ్రయానికొచ్చిన కుటుంబసభ్యులు అది తమవాడిది కాదని తెలుసుకొని నోరెళ్లబెట్టారు. అయితే అప్పటికే ఆలస్యం జరిగింది. ఆ మృతదేహానికి ఇంకో చోట అంత్యక్రియలు పూర్తయ్యాయి. సౌదీ నుంచి భారత్‌కు వచ్చిన మృతదేహాల విషయంలో దొర్లిందీ పొరపాటు. మరో విషయం ఏమిటంటే.. రెండు మృతదేహాల్లో ఒకటి హిందువుది. మరొకటి ముస్లిం వ్యక్తిది. వివరాల్లోకి వెళితే.. సౌదీలో కేరళ కొల్లాం జిల్లాకు చెందిన శజీ రాజన్‌ రెండున్నర నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే వారం క్రితం యూపీ వరాణసీకి చెందిన జావీద్‌ గుండెపోటుతో మృతిచెందాడు. ఒకేరోజు వేర్వేరు విమానాల్లో మృతదేహాలను భారత్‌కు పంపారు. అయితే సౌదీ దమ్మాంలోని విమానాశ్రయ కార్గో విభాగంలో శవపేటికలపై ఏయిర్‌ వే బిల్లులు జతపరిచే సమయంలో పొరపాటు దొర్లింది. ఫలితంగా కేరళకు తరలించాల్సిన మృతదేహాన్ని యూపీకి, అక్కడికి వెళ్లాల్సిన మృతదేహాన్ని కేరళకు తరలించారు. శవపేటికలపై మాత్రం అసలు పేర్లే రాసి ఉన్నాయి. కాగా రెండు నెలల తర్వాత మృతదేహం చేరడంతో కేరళలోని మృతుడికి కుటుంబసభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా  హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేశారు. అయితే రాజన్‌ కూతురు మృతదేహాన్ని చూసి... రోదిస్తూనే ‘మృతదేహం నాన్నది కాదు’ అని   చెబుతున్నా తండ్రి పోయిన బాధలో ఆమె అలా చెబుతోందని భావించారే తప్ప ఎవ్వరూ పట్టించుకోలేదు. శవపేటిక మీద జావీద్‌ అని రాసివున్న పేరునూ చూడలేదు. మరోవైపు యూపీ వారాణసీ విమానాశ్రయంలో శవపేటిక స్వీకరించేందుకు జావీద్‌ మామ ముస్తఖీం వచ్చాడు.


ఎయిర్‌ వే బిల్లుపై జావీద్‌ అహ్మద్‌ రాసివున్నా.. శవపేటికపై రాజన్‌ అని ఉండటంతో అనుమానం వచ్చి సౌదీలోని కంపెనీ వారికి సమాచారం ఇచ్చాడు. వారు వాకబు చేస్తే కార్గోలో పొరపాటు జరిగిందని, ఫలితంగానే శవపేటికలు మారాయన్న విషయం తేలింది. అయితే జావీద్‌ మృతదేహాన్ని తమకు అప్పగించాలని అడిగిన జావీద్‌ కుటుంబసభ్యులు, అప్పటికే ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయని తెలిసి నిర్ఘాంతపోయారు. అయితే వరాణసీకి చేరిన రాజన్‌ మృతదేహాన్ని కేరళకు తరలించాలంటూ సామాజిక సేవకుడు నాజ్‌ శౌకత్‌ భారత రాయబార కార్యాలయం ద్వారా యూపీ ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా వరణాసీ నుంచి 2500 కి.మీ దూరంలోని కేరళలోని కొల్లాం జిల్లాకు మృతదేహాన్ని తరలించారు. రాజన్‌ కుటుంబభ్యులు ‘రెండోసారి’ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 


Updated Date - 2022-10-11T14:38:47+05:30 IST