ప్రేమించిన యువతి రెండోసారీ నో.. ఒంట్లో నలతగా ఉంది ఇంటికి వెళ్తానని చెప్పి.. లండన్‌లో ఈ తెలుగు విద్యార్థి ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-09-25T14:17:14+05:30 IST

తన ప్రేమను కాదనడంతో మనసు వికలమై లండన్‌లో తెలుగు విద్యార్థి అన్నపురెడ్డి సాయిమోహన్‌రెడ్డి(20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రేమించిన యువతి రెండోసారీ నో.. ఒంట్లో నలతగా ఉంది ఇంటికి వెళ్తానని చెప్పి.. లండన్‌లో ఈ తెలుగు విద్యార్థి ఏం చేశాడంటే..

లండన్‌లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

బుల్లెట్‌ట్రైన్‌కు ఎదురెళ్లిన సాయి

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తన ప్రేమను కాదనడంతో మనసు వికలమై లండన్‌లో తెలుగు విద్యార్థి అన్నపురెడ్డి సాయిమోహన్‌రెడ్డి(20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు కోసం విదేశానికి వెళ్లిన తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సాయిరాం ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని అన్నపురెడ్డి కనకారెడ్డి, కవిత దంపతుల కుమార్తె స్వాతి, కుమారుడు సాయిమోహన్‌రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ లండన్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. స్వాతి ఎంటెక్‌ చేస్తుండగా, సాయి మోహన్‌రెడ్డి బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. 


సాయిమోహన్‌రెడ్డి, హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో తోటి విద్యార్థినిని ప్రేమించాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. సాయి లండన్‌లో బీటెక్‌ చేసేందుకు వెళ్లాడు. ఈనెల 5న లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన సాయిమోహన్‌రెడ్డి తన బ్యాచ్‌మేట్స్‌తో కొన్ని రోజులు పలు చోట్ల పర్యటించారు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి కూడా వీరితో కలిసి వెళ్లింది. మరోసారి సాయిమోహన్‌రెడ్డి తన ప్రేమను వ్యక్తం చేయగా, ఆమె అంగీకరించలేదు. అనంతరం ఈ నెల 15న సాయిమోహన్‌ తిరిగి లండన్‌కు వెళ్లాడు. 


ఒంట్లో నలతగా ఉంది.. ఇంటికి వెళ్తున్నానని..

 ఈ నెల 21న అక్క స్వాతిని ఆఫీసు వద్ద దింపిన సాయి.. ఒంట్లో నలతగా ఉంది ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం స్వాతి తమ్ముడు సాయికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దాంతో లండన్‌లోనే ఉంటున్న మేనమామ  అజయ్‌రెడ్డి, అత్త నవ్యకు ఫోన్‌ చేయగా వారు వెళ్లి స్వాతిని తీసుకొచ్చి ఇంట్లో దించి తిరిగి వెళ్తున్న సమయంలో సాయిమోహన్‌రెడ్డి రోడ్డుపై ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడుగగా నేను తర్వాత వస్తానని చెప్పి వెళ్లి పోయాడు. ఆ తర్వాత ఫోన్‌ పనిచేయలేదు. అనుమానం వచ్చిన అత్తమామలు బర్మింగ్‌హాం ప్రాంతంలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు (ఈ నెల 21వ తేదీన) గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించిన చెప్పులు, కళ్ళ అద్దాలను పరిశీలించాలని పోలీసులు స్వాతికి సమాచారం ఇవ్వగా అవి తన తమ్ముడు సాయి వస్తువులేనని ఆమె గుర్తించింది.


బుల్లెట్‌ ట్రైన్‌కు ఎదురెళ్లి

మృతదేహం వద్ద లభించిన వస్తువులు సాయివిగా నిర్ధారణ కావడంతో సాయి ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం వెలుగుచూసింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.30 తర్వాత బుల్లెట్‌ ట్రైన్‌కు అడ్డంగా నిలబడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు స్వాతికి తెలిపారు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లను స్వాతితో పాటు మేనమామ అజయ్‌రెడ్డికి చూపించారు. 


మృతదేహాన్ని రప్పించేందుకు సీఎం పేషీ యత్నాలు

 మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు అక్క స్వాతి, మేనమామ అజయ్‌రెడ్డి భారత ఎంబసీతో పాటు సీఎం కేసీఆర్‌ పేషీ నుంచి కూడా బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా హైకమిషనర్‌తో సమాలోచనలు చేసినట్లు తెలిసింది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి సహాయ సహకారాలు తీసుకున్నట్లు సమాచారం.

Read more