గల్ఫ్ గోస.. ఎడారి దేశంలో ఆగుతున్న గుండెలు

ABN , First Publish Date - 2022-05-26T16:25:40+05:30 IST

విదేశీయానం ఓ అందమైన కళ.. అక్కడే ఉద్యోగం.. గౌరవ ప్రదమైన బాధ్యత.. మావాడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకోవడానికి అనేకమంది తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు.

గల్ఫ్ గోస.. ఎడారి దేశంలో ఆగుతున్న గుండెలు

ఏజెంట్ల మోసం ఒకవైపు..

మరోవైపు పని ఒత్తిడి

మృతదేహాల కోసం

బాధిత కుటుంబాల  ఎదురుచూపులు

ఇంటికి తెప్పించాలంటూ కన్నీటి వేడుకోలు

సుభాష్‌నగర్‌, మే 25: విదేశీయానం ఓ అందమైన కళ.. అక్కడే ఉద్యోగం.. గౌరవ ప్రదమైన బాధ్యత.. మావాడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకోవడానికి అనేకమంది తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ విదేశీయానం ఓ ప్రమాదకరమైన జీవితంలోకి ప్రవేశమని భావిస్తున్నారు. పొట్ట చేతపట్టుకుని విమానం ఎక్కినవారు ఏ రూపంలో తిరిగివస్తారో? తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాల తో మరణిస్తుంటే, మరికొందరు పని ఒత్తిడిని తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అనేక మంది జైలు జీవితాలను అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో గల్ఫ్‌బాట పట్టిన వారి సంఖ్య జిల్లాలోనే అధికంగా ఉంది. జిల్లాలో ఉపా ధి అవకాశాలు లేక, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఎంతోమంది బతుకుదెరువు  కోసం గల్ఫ్‌బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 3లక్షల మందికిపైగా గల్ఫ్‌దేశంలో ఉన్నారు. దుబాయి, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఓమన్‌, బెహరాన్‌, తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో చాలా మంది గల్ఫ్‌బాట పట్టినవారు ఎప్పుడు ఏ క్షణాల్లో తిరుగు  ముఖం పట్టాల్సిందోనని తెలియని పరిస్థితుల్లో గడుపుతున్నారు. విజిట్‌ విసాలపై వెళ్లినవారు అక్కడ ఉద్యోగాలు దొరకక విసాల గడువు ముగిసిన వారు బిక్కుబిక్కు మంటూ తలదాచుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడితే చట్టపరమైన చర్యలతో సంపాదించిందంత వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని పొట్టచేత బట్టుకోని కాలం వెళ్లదీస్తున్నారు. తిరిగి గ్రామాల్లోకి వద్దామంటే గ్రామాల్లో చేసిన అప్పులతో గుండె బరువెక్కుతున్నాయి. దీంతో కక్కలేక, మింగలేక ఎడారి దేశాల్లో నానా అవస్థలు పడుతున్నారు. 


అడుగడుగునా ఏజెంట్ల మోసాలు

ఉపాధి కోసం విదేశీ బాట పట్టిన తొలి అడుగులోనే మోసాలు ఎదురవుతున్నా యి. పర్మనెంట్‌ పని ఉందని ప్రముఖమైన ఉద్యోగమని భారీ మొత్తంలో సంపాదించొచ్చునని నమ్మబలుకుతున్న ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేసినా.. తీరా అక్కడికి వెళ్లాక అడ్డమీది కూలీలు గా జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఏజెంట్ల మోసాలు ప్రతీ రోజు ఏదో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. బాదితులు వారి సంబధీకులు ఏజెంట ్లకు గొడవలకు దిగుతూనే ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ధర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్‌, మోర్తాడ్‌, వేల్పూర్‌, ఆర్మూర్‌, నందిపేట్‌ తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల మోసా లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏజెంట్ల మోసాల కారణంగా అప్పులపాలవుతు న్న వారు కొందరైతే మానసిక వేదనకు గురై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. నవీపేట మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన రెమ్మ రాజేశ్వర్‌ అప్పులు ఎలాతీర్చాలో తెలియక మానసిక వేదనకు గురై దుబాయిలో ఇటీవలే గుండెపోటుతో మృతి చెందాడు. భీమ్‌గల్‌ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మాలావత్‌ రాజ్‌కుమార్‌ ఇటీవలే మస్కట్‌ ఓమన్‌లో మరణించాడు. మరణించి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు అక్కడి నుంచి శవం రాలేదు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన తుడెం శ్రీనివాస్‌ ఏప్రిల్‌ 18న గుండెపోటుతో బెహరాన్‌లో మరణించాడు.


కుటుంబీకుల ఎదురుచూపులు

ఉపాధి కోసం వెళ్లిన గల్ఫ్‌ బాధితులు జరగరాని ప్రమాదం సంభవించి మరణిస్తే అక్కడి నుంచి స్వదేశానికి వారి మృతదేహాలు రావడం ఇబ్బందిగా మారింది. నెలల తరబడి మృతదేహాలు రాకపోవడంతో వారి కుటుంబాలు కడచూపు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కొద్దిగా తెలిసినవారైతే ప్రజాప్రతినిధుల ద్వారా మృతదేహాలను తెప్పించే ప్రయత్నం చేసినా మరికొందరు ఎవరిని కలవాలో తెలియక మృతదేహాల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారు. మృతదేహాల తరలింపు అన్నది డబ్బుతో కూడుకున్న విష యం కావడంతో వాటిని స్వదేశాలకు తరలించడం ఇబ్బందిగా మారింది. అక్కడి సామాజిక సేవ నిర్వాహకులు కొం దరు మృతదేహాలను స్వదేశాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తుండ గా తోటి స్నేహితులు తలాకొంత డబ్బులు జమచేసి స్వదేశానికి మృతదేహాన్ని పంపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి  ఎలాంటి సహా య సహకారాలు అందించకపోవడంతో మృతదేహాల తరలింపు ఆలస్యమవుతోంది.  


ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌లు నా భర్త శవాన్ని రప్పించాలి

మూడు సంవత్సరాల క్రితం మంచి పని ఉందని ఏజెంట్‌ ద్వారా దుబాయి వెళ్లాడు. ఏజెంట్‌ మోసంతో అక్కడ నరకయాతన అనుభవించాడు. గత రెండేళ్లు గా రూపాయి కూడా ఇంటికి పంపలేదు. నందిపేట మండలం కంటం గ్రామానికి చెందిన ఏజెంట్‌ స్వామి లక్ష రూపాయలు తీసుకుని సరైన విసా ఇవ్వలేదు. ఇటీవల గుండెపోటుతో నాభర్త దుబాయిలో చనిపోయాడు. నా భర్త శవాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌లు ఎలాగైనా ఇంటికి రప్పించాలి. -మృతుడు రాజేశ్వర్‌ భార్య బేగరి పుష్ప, అభంగపట్నం, నవీపేట మండలం

Read more