Saudi: మతిస్థిమితం కోల్పోయి సౌదీలో తప్పిపోయిన తెలుగు యువకుడు

ABN , First Publish Date - 2022-11-23T18:36:33+05:30 IST

ఉపాధి కొరకు ఎడారి దేశానికి వచ్చిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి.. విమానాశ్రాయం వద్ద తప్పిపోయిన యువకుడి ఆచూకీ తెలుసుకోవడానికి అతడి కుటుంబం..

Saudi: మతిస్థిమితం కోల్పోయి సౌదీలో తప్పిపోయిన తెలుగు యువకుడు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉపాధి కొరకు ఎడారి దేశానికి వచ్చిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి.. విమానాశ్రాయం వద్ద తప్పిపోయిన యువకుడి ఆచూకీ తెలుసుకోవడానికి అతడి కుటుంబం తీవ్రంగా కష్టపడుతోంది. యువకుడు విమానాశ్రయం వరకూ వచ్చినా.. ఫ్లైట్ ఎక్కి హైద్రాబాద్‌కు చేరుకోలేదు. అలాగని విమానాశ్రయం వద్ద కూడా లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

​నిజామాబాద్ నగరంలోని హషీం కాలనీకి చెందిన షోయెబ్ అహ్మద్ అనే 30 ఏళ్ల యువకుడు పది రోజుల క్రితం ఉపాధి కొరకు సౌదీ అరేబియాకు వచ్చాక అనూహ్యంగా మతిస్థిమితం కోల్పోయాడు. అహ్మద్ వింతగా ప్రవర్తంచడంతో.. అతడిని యజమాని తిరిగి భారతదేశానికి పంపించడానికి సోమవారం రాత్రి రియాధ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

ఈ క్రమంలోనే అహ్మద్‌ను స్వస్థలానికి తీసుకెళ్లేందుకు అతడి కుటుంబ సభ్యులు హైద్రాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే.. అహ్మద్ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. విషయం ఆరా తీశారు. ఈ క్రమంలోనే అహ్మద్ హైద్రాబాద్‌కు రాలేదని తెలుసుకున్నారు. రియాధ్‌లో కూడా అతడు విమానం ఎక్కలేదని తెలుసుకున్నారు. యువకుడి వద్ద ఫోను గానీ కుటుంబ సభ్యుల నెంబర్లు గానీ లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. అందువల్ల పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే 0556473503 నెంబర్ ద్వారా సమాచారం అందించాలని సౌదీలోని సామాజిక కార్యకర్త ముజ్జమ్మీల్ శేఖ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-23T19:42:28+05:30 IST