రివర్‌డేల్‌లో కన్నులపండువగా శ్రీవారి కల్యాణం

ABN , First Publish Date - 2022-07-19T03:18:42+05:30 IST

రివర్‌డేల్ నగరంలో జూలై 9న టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.

రివర్‌డేల్‌లో కన్నులపండువగా శ్రీవారి కల్యాణం

రివర్‌డేల్ నగరంలో జూలై 9న టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అట్లాంటా హిందూ దేవాలయంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమల దేవాలయ అర్చక స్వామి శ్రీధర్ ఆచార్య.. వైఖానస ఆగమశాస్త్రానుసారం వెంకటేశ్వర కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన ఆ కలియుగ నాయకుడి కల్యాణం చూస్తూ స్థానికులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. 


దాదాపు 3 వేల మంది శ్రీవారి కల్యాణాన్ని తిలకించేందుకు పోటెత్తారు. ప్రత్యేకంగా అలంకరించిన వివాహ వేదికపై మెరిసిపోతున్న స్వామివారిని దర్శించుకున్నారు. అచర్చక స్వామి శ్రీధర్ ఆచార్య..కల్యాణంలోని ప్రతి క్రతువు విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాన్ని జరిపించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేలుకొల్పడం, 200 మంది భక్తులు శ్రీవిష్ణు సహస్రనామస్తోత్ర పఠనంతో వేదిక మొత్తం మారుమోగిపోయింది. కల్యాణోత్సవంలో భాగంగా 100 మంది సంగీత విద్వాంసులు, వారి శిష్యులు సందర్భోచితంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ఇక హిందూ దేవాలయ అర్చకులు.. టీటీడీ అర్చకులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించారు. అట్లాంటా హిందూ టెంపుల్ ప్రెసిడెంట్.. ప్రశాంతి అసిరెడ్డి, ఇతర కార్యవర్గసభ్యుల పటిష్ట ప్రణాళికలు, కృషి ఫలితంగా కల్యాణోత్సవం దిగ్విజయంగా జరిగింది. 


అమెరికాలోని భారతీయుల కోరిక మేరకు టీటీడీ వివిధ నగరాల్లో శ్రీవారి కల్యాణమహోత్సవాన్ని జరుపుతోంది. జూన్ 18 మొదలు ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఈ వేడుక నిర్వహించింది. తిరుమల నుంచి శ్రీవారు, శ్రీదేవీ, భూదేవి విగ్రహాలను టీటీడీ అమెరికాకు తెప్పించింది. శాన్‌ఫ్రాన్‌సిస్కో, సియాటిల్, డాలస్, సెయింట్ లూయిస్, చికాగో, న్యూఆర్లీన్స్, వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలోని భక్తులు శ్రీవారి కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. స్వామివారిని దర్శించుకునే అపురూప అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేశారు. Read more