Yoga: 'యోగా' విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై దేశవ్యాప్తంగా..

ABN , First Publish Date - 2022-10-01T14:56:20+05:30 IST

మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన ప్రక్రియే 'యోగా' (Yoga).

Yoga: 'యోగా' విషయంలో సౌదీ సంచలన నిర్ణయం.. ఇకపై దేశవ్యాప్తంగా..

రియాద్: మనిషి శరీరానికి మెదడుకి మధ్య ఏకత్వాన్ని లేక సంయోగాన్ని కుదిర్చే సునిశితమైన ప్రక్రియే 'యోగా' (Yoga). శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టికరమైన ఆహారం తీసుకోవచ్చు. మెడిసిన్స్ వేసుకోవచ్చు. ఇలా ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు. మనసును కూడా స్పర్శించి.. శరీరాన్ని, మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగా అభ్యాసానికి మాత్రమే ఉంది. యోగాకు ఉన్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా వైపు చూస్తోంది. 


ఇక ఐక్యరాజ్యసమితి (United Nations) కూడా 2014 ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 21వ తారీఖున 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'గా జరుపుకోవాలని నిర్ణయిస్తూ.. ఈ ప్రక్రియకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. దాంతో గడిచిన ఆరేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఇలా ఇప్పుడిప్పుడే యోగా ప్రాముఖ్యత ప్రపంచవ్యాపితమవుతోంది. తాజాగా అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) కూడా యోగా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో యోగాను పరిచయం చేయాలని నిర్ణయించింది. దైనందిన జీవనంలో యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ యోగా కమిటీ వెల్లడించింది. సౌదీ యూనివర్సీటిస్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (Universities Sports Federation) సహకారంతో దేశంలోని విశ్వవిద్యాలయాల్లో యోగాను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాల కోసం యోగా అభ్యాసాన్ని ఒక జీవనశైలిగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా యోగా కమిటీ పేర్కొంది. దీనిలో భాగంగా సౌదీ అరేబియా అంతటా ఉన్న యూనివర్శిటీ ప్రతినిధులందరికీ యోగాపై 'యోగా ఫర్ యూనివర్శిటీ స్టూడెంట్స్ ఆఫ్ బోత్ జెండర్స్' అనే పేరుతో వర్చువల్ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 


భారతదేశంలోని ఆసియా యోగాసనా స్పోర్ట్స్ ఫెడరేషన్ నుండి యోగా ప్రతినిధి బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. కింగ్‌డమ్‌లో సౌదీ యోగా రిఫరీలకు శిక్షణ ఇవ్వడానికి సౌదీ యోగా కమిటీ సహకారంతో క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక కోర్సును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది. ఈ కోర్సు ద్వారా సౌదీ విశ్వవిద్యాలయాలకు సంప్రదాయ యోగా, యోగాసన క్రీడలను పరిచయం చేయాలని నిర్ణయించింది. అలాగే విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలోని విద్యార్థులకు వారి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను అభ్యసించడానికి అవకాశం ఇచ్చింది. దీని ద్వారా వృత్తిపరమైన యోగాసన క్రీడా శిక్షణలో చేరడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా స్థానికంగా, అంతర్జాతీయంగా పోటీల్లో కూడా భాగం కావాలని భావిస్తోంది. 


ఈ సందర్భంగా సౌదీ యోగా కమిటీ అధ్యక్షురాలు నౌఫ్ అల్మార్వాయ్ (Nouf Almarwaai) మాట్లాడుతూ.. సౌదీ సమాజంలో యోగాను పెద్ద ఎత్తున వ్యాప్తి చేయాలనే తన దృక్పథాన్ని సాధించేందుకు కమిటీ ప్రయత్నిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగానే సౌదీ యూనివర్శిటీస్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌తో కలిసి ఒక తరాన్ని నిర్మించడానికి ప్రత్యేక చొరవ తీసుకున్నామని వివరించారు. యోగా ప్రేమికులు ముఖ్యంగా యువకులు.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి అభ్యాసకుల సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్నారు. అలాగే స్థానిక, ప్రాంతీయ యోగా ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనే యోగా బృందాలను తయారు చేయడానికి కమిటీ ప్రయత్నిస్తుందని ఆమె తెలిపారు. యోగాలో కింగ్‌డమ్ అరబ్ స్థాయిలో రాణించడం ఖాయమని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-01T14:56:20+05:30 IST