డాలర్ పైపైకి.. ఖర్చుల అంచనాలు తారుమారు.. భారత విద్యార్థులకు భారంగా మారుతున్న అమెరికా చదువులు

ABN , First Publish Date - 2022-09-25T13:34:57+05:30 IST

డాలర్‌తో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. దీంతో విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

డాలర్ పైపైకి.. ఖర్చుల అంచనాలు తారుమారు.. భారత విద్యార్థులకు భారంగా మారుతున్న అమెరికా చదువులు

రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ

గతేడాది రూ.73 ఉంటే ప్రస్తుతం రూ.81పైనే

ఫీజులు చెల్లించే సమయంలోనే పైపైకి..

తారుమారవుతున్న ఆర్థిక ప్రణాళికలు

విద్యార్థులపై 8 లక్షల వరకు అదనపు భారం

విమాన చార్జీలపైనా డాలర్‌ ప్రభావం

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాలర్‌తో రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. దీంతో విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్న విద్యార్థులకు డాలర్‌ విలువ పెరగడం ఆర్థికంగా భారంగా మారుతోంది. విద్యార్థులు డాలర్‌ విలువ  ఆధారంగానే చదువుకు, ఇతర ఖర్చులకు అవసరమయ్యే నిధులను ముందుగానే సమకూర్చుకుని వెళుతుంటారు. అయితే... డాలర్‌ విలువ అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఈ అంచనాలు తప్పుతున్నాయి. ఏడాది, రెండేళ్ల క్రితం ఉన్న డాలర్‌ విలువకు, ఇప్పటి విలువకు భారీగా వ్యత్యాసం ఉంది. ఫలితంగా విద్యార్థులపై లక్షల్లో అదనపు భారం పడుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్య కోసం భారత్‌ నుంచి ఏటా భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. దేశం నుంచి సుమారు 2 లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులు చేయడానికి ఏటా అమెరికాకు వెళ్తున్నారు. ఇందులో తెలుగు విద్యార్థుల సంఖ్య భారీగా ఉంటోంది. ఏటా అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థులు సుమారు 15వేల మంది వరకు ఉంటారని అంచనా. అమెరికాతోపాటు ఆస్ర్టేలియా, కెనడా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు వెళ్లే తెలుగు విద్యార్థుల సంఖ్య 30వేల మంది వరకు ఉంటుంది. అయితే... డాలర్‌ విలువ పెరగడంతో అమెరికా వెళ్లే విద్యార్థులపైనే అదనపు భారం పడుతోంది. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్‌ విలువ అధికంగా పెరుగుతోంది. 


రూపాయితో పోలిస్తే 

రెండు మూడేళ్లలోనే డాలరు విలువ రూ.8 వరకు పెరిగింది. సాధారణంగా విదేశీ విద్య కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు... కోర్సు పూర్తయ్యే వరకు చెల్లించాల్సిన ఫీజులతోపాటు వసతి, భోజనం ఖర్చులకు అవసరమైన నిధులను కూడా ముందుగానే సమకూర్చుకుని వెళుతుంటారు. అక్కడ చెల్లించే ఫీజులు కానీ, ఇతర ఖర్చులు కానీ విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుంది. దాంతో పీజీ కోర్సు పూర్తయ్యేనాటికి (రెండేళ్లకు) ఎంత ఖర్చవుతుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకుంటారు. ఆ మేరకు డాలర్‌ విలువకు అనుగుణంగా లెక్కలేసుకుని ప్రణాళికను రూపొందించుకుంటారు. 


ఖర్చుల అంచనాలు తారుమారు 

అయితే... తీరా అమెరికా వెళ్లి కోర్సుల్లో చేరిన తర్వాత డాలర్‌ విలువ పెరగడంతో మొదట్లో వేసుకున్న ఖర్చుల అంచనాలు తారుమారవుతున్నాయి. అమెరికాలోని చాలావరకు నేషనల్‌ యూనివర్సిటీల్లో పీజీ ఫీజులు ఏడాదికి సుమారు రూ.40వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్టేట్‌ యూనివర్సిటీల్లో కొంత తక్కువగా ఫీజులు ఉంటాయి. కోర్సు ఫీజులు కాకుండా వసతి, భోజనం, ఇతర ఖర్చుల కోసం నెలకు 1,000 నుంచి 1,200 డాలర్ల వరకు ఖర్చవుతాయి. మొత్తంగా ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఏడాదికి ఒక్కోవిద్యార్థికి సుమారు 50వేల డాలర్ల వరకు అవసరం ఉంటుంది. గతేడాది ఆగస్టు అడ్మిషన్‌ సెషన్‌ సమయంలో రూపాయితో పోల్చుకుంటే డాలర్‌ మారకం విలువ రూ.73గా ఉంది.


అంటే... సుమారు రూ.36లక్షలు అవసరమవుతాయి. ఏడాది తిరిగేసరికి... అంటే ఈ ఏడాది అడ్మిషన్‌ సెషన్‌ సమయానికి డాలర్‌ విలువ రూ.80 దాటింది. దీని ప్రకారం చూస్తే... ఏడాదికి రూ.40లక్షల వరకు అవసరం ఉంటుంది. అంటే విద్యార్థులపై ఏడాదికి అదనంగా సుమారు రూ.4 లక్షల వరకు భారం పడుతోంది. డాలర్‌ రేటు ఇలాగే ఉంటే రెండేళ్ల పీజీ కోర్సు పూర్తయ్యేనాటికి రూ.8లక్షలు అదనంగా ఖర్చవుతుంది. ఇప్పటిలాగే పెరుగుతూ పోతే విద్యార్థులపై మరింత భారం పడనుంది. 


Updated Date - 2022-09-25T13:34:57+05:30 IST