NRI: అందుకే భారతీయులు అమెరికాలో టాప్‌లో ఉన్నారు.. ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-11-27T21:08:38+05:30 IST

అమెరికాలో భారత సీఈఓల విజయాలకు కారణాలు ఇవే..

NRI: అందుకే భారతీయులు అమెరికాలో టాప్‌లో ఉన్నారు.. ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: అమెరికా వ్యాపార రంగంలో భారతీయ సీఈఓలు(Indian CEOs) అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ప్రముఖ టెక్ కంపెనీల్లో మెజారిటీ సంస్థలకు మనోళ్లే నాయకత్వం వహిస్తున్నారు. మరి అమెరికాలో భారతీయుల విజయాలకు కారణం ఏమిటి(Reason for Success)..? అన్న ప్రశ్నకు ప్రపంచప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ అడ్వైజర్, రచయిత డా. రామ్ చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. భిన్న సంస్కృతులు, నేపథ్యాలున్న వారిని కలుపుకుని ముందుకు పోగలిగే(Adoptive Nature) సామర్థ్యమే భారతీయ సీఈఓల విజయాలకు కారణమని చెప్పారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

డా. రామ్ చరణ్ అభిప్రాయం ప్రకారం.. భారతీయుల కుటుంబ నేపథ్యాలు కూడా వారి విజయాలకు మరో కారణం. భారతీయుల కుటుంబాలు పెద్దవి కావడం, భిన్న వ్యక్తిత్వాలున్న వారితో బాంధవ్యం నెరపడంతో వారిలో సహజంగానే సహనం అలవడుతుంది. అయితే..భారతీయ సీఈఓలకు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే అలవాటే వారి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు.

అయితే.. చర్చల్లో పాల్గొనేటప్పుడు భారతీయ నాయకులు ఒక్కోసారి వేగంగా స్పందిస్తుంటారని, ఇదే వారు ఎదుర్కొనే అతి పెద్ద సవాలని వివరించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో(Communication Skills) భారతీయులు మెరుగైనప్పటికీ.. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు అవతలి వారు చెప్పేది ఓపిగ్గా వినాలని, ఎదుటివారి కోణంలో విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని వివరించారు. ఓ సమస్యకు మన వద్ద పరిష్కారం ఉన్నప్పటికీ అవతలి వారు చెప్పేది వినడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-27T21:10:49+05:30 IST