అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఎన్నారైలు

ABN , First Publish Date - 2022-03-05T00:03:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చియార్టు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. హైకోర్టు తీర్పును స్వా

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఎన్నారైలు

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని టీడీపీ సీనియర్ నేత, గుంటూరు మిర్చియార్టు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు మాగులూరి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ.. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, సీఆర్డీయే చట్టాన్ని  మార్చేందుకు వీల్లేదనే హైకోర్టు తీర్పును స్వాగతించారు. రాష్ట్ర రాజధానిని మార్చేలనే ఆలోచనను ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి మానుకోవాలన్నారు. ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్నారు. అమరావతి ఉద్యమాన్ని అడ్డుకునేందుకు సీఎం చేయని కుట్ర లేదన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తాను హైకోర్టులో పిల్ వేసినట్టు గుర్తు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇష్టానుసారంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చట్టాలు చేయకుండా హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఇకనైనా రైతుల త్యాగాలను గుర్తించి సీఎం తన మనసు మార్చుకోవాలని కోరారు. 



అనంతరం మాగులూరి భాను ప్రకాష్ మాట్లాడుతూ.. అమరావతిని తరలించడం సీఎం జగన్ వల్ల కాదని, ప్రజా క్షేత్రం లోనూ, న్యాయస్థానంలోనూ అమరావతి గెలిచిందన్నారు. ఇది 5కోట్ల ఆంధ్రుల విజయమన్నారు. రాజధాని రైతుల పోరాటంలో న్యాయం ఉంది అన్నారు. అందువల్లే రైతులకు న్యాయస్థానంలో న్యాయం దొరికిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ లికిత్ మాట్లాడుతూ.. అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో తెలుగు జాతిని నవ్వులపాలు చేసిందన్నారు. హైకోర్టు తీర్పుపై అనవసరపు పట్టుదలకు పోకుండా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 



భారీ వరదల్లోనూ అమరావతిలోని ఒక్క ప్రాంతం కూడా ముంపునకు గురి కాలేదని బోయపాటి యువ సిద్ధార్థ అన్నారు. కానీ అమరావతిలోని ప్రాంతాలు ముంపునకు గురైనట్టు వైసీపీ దుష్ర్పచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం అని అన్నారు. ఆ తర్వాత అంకిత ఉప్పలపాటి మాట్లాడారు. ప్రపచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం రైతులు తమ భూమిని ఇచ్చినట్టు గుర్తు చేశారు. 800 రోజులకు పైగా ధర్నా చేస్తున్న రాష్ట్ర ప్రజలకు హైకోర్టు తీర్పు శుభవార్త లాంటిదన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందని రమ్య బెల్లం అభిప్రాయపడ్డారు. విజయం సాధించిన రాష్ట్ర ప్రజలకు, అమరావతి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటి కార్తీక్, వినీల్ శ్రీరామినేని, చంద్రశేఖర్ నాదెళ్ల, డాక్టర్ నాగ శంకర్ దేవినేని, వైవీ సీతారామరావు, ఇంటూరి రామకృష్ణ, కర్నాటి సతీష్, కోడూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-03-05T00:03:30+05:30 IST