60 ఏళ్లు దాటిన ప్రవాసుల విషయంలో కువైత్ మరో కీలక నిర్ణయం..!

ABN , First Publish Date - 2022-02-23T18:45:52+05:30 IST

60 ఏళ్లు పైబడి, హైస్కూల్ సర్టిఫికేట్ కలిగిన ప్రవాసుల విషయంలో తాజాగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

60 ఏళ్లు దాటిన ప్రవాసుల విషయంలో కువైత్ మరో కీలక నిర్ణయం..!

కువైత్ సిటీ: 60 ఏళ్లు పైబడి, హైస్కూల్ సర్టిఫికేట్ కలిగిన ప్రవాసుల విషయంలో తాజాగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ ప్రవాసులు తప్పనిసరిగా వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి తాత్కాలిక పొడిగింపులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇటీవల అమలులోకి వచ్చిన 250 కువైటీ దినార్ల(రూ.61వేలు) రెన్యువల్ రుసుము, 503 దినార్ల(రూ.1.23లక్షలు) హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజులు చెల్లించి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకోవాలని సూచించింది. 


కాగా, మధ్యలో కొన్నాళ్లు ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో 30 నుంచి 90 రోజుల వ్యవధితో తాత్కాలిక పొడిగింపుకు కువైత్ రెసిడెన్సీ అఫైర్స్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీనికి గాను రోజుకు రెండు కువైటీ దినార్లు వసూలు చేశారు. ఇప్పుడు ఇకపై ఈ తాత్కాలిక పొడిగింపులు ఉండవని ప్రకటించింది. దీంతో ప్రవాసులు తప్పనిసరిగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు లోబడి వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం లేదా ఫ్యామిలీ వీసాకు బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటే ఆ పని చేయడం. లేనిపక్షంలో కువైత్‌ను వీడాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. తాజా గణాంకాల ప్రకారం 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని 62,948 మంది ప్రవాసులు కువైత్ ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.  

Read more