NRI: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను సన్మానించిన ఎన్నారైలు

ABN , First Publish Date - 2022-09-09T02:27:04+05:30 IST

హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ జనరల్‌గా(US consulate General, Hyderabad) అమెరికా రాయబారిగా‌ జెన్నిఫర్ లార్సన్ నియమితులైన నేపథ్యంలో అమెరికా ప్రవాసీయులు వాషింగ్టన్ డీసీలో అభినందన సభ ఏర్పాటు చేశారు.

NRI: హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను సన్మానించిన ఎన్నారైలు

హైద‌రాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద అమెరిక‌న్ కాన్సులేట్ 

భార‌త్ అమెరికా సంబంధాలు మ‌రింత మెరుగు 

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వేగంగా వీసాల‌ జారీ ప్ర‌క్రియ 

అమెరికాలో సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ వ్యాపార వేత్త ర‌వి పులి, అమెరిక‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ జెన్నిఫ‌ర్ లార్స‌న్‌ వెల్ల‌డి 


హైద‌రాబాద్: ఆసియాలోనే అతిపెద్ద అమెరిక‌న్ కాన్సులేట్ కార్యాల‌యం ఏర్పాటు కాబోతున్న‌ద‌ని.. త‌ద్వ‌రా భార‌త్ - అమెరికా సంబంధాలు మ‌రింత మెరుగుప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలంగాణ‌కు చెందిన ఎన్నారై.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ వ్యాపార వేత్త‌, ఇంటర్నేష‌న‌ల్ సొల్యూష‌న్స్ గ్రూప్ అధినేత‌  ర‌వి పులి పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలో అమెరికాలో చిక్కుకుపోయిన అనేక మంది భార‌తీయుల‌ను ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసి భార‌త్‌కు చేర్చిన.. తెలంగాణ వ్యాపార దిగ్గ‌జంగా ర‌వి పులి గుర్తింపు పొందారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అమెరిక‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్‌గా నియ‌మితులైన మిస్ జెన్నిఫ‌ర్ లార్స‌న్ గౌర‌వార్థం వాషింగ్ట‌న్ డీసీలో ర‌వి పులి ఆధ్వ‌ర్యంలో అభినంద‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్య‌క్ర‌మంలో మిస్ జెన్నిఫ‌ర్‌ను స‌త్క‌రించేందుకు సాఫ్ట్‌వేర్ రంగంలో ప‌నిచేస్తున్న తెలుగు ఎన్నారై వ్యాపార‌వేత్త‌ల‌తోపాటు వివిధ రంగాల ప్ర‌ముఖ‌లు.. అమెరికా- భార‌త్ వాణిజ్య వాపార సంబంధాల్లో చురుకుగా పాల్గొంటున్న తెలుగు వారు, అనేక రాష్ట్రాల‌కు చెందిన భార‌తీయులు పాల్గొని మిస్ జెన్నిఫ‌ర్ లార్స‌న్‌ను స‌త్క‌రించారు.


ఈ సంద‌ర్భంగా ర‌వి పులి మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద అమెరిక‌న్ కాన్సులేట్ హైద‌రాబాద్‌లో ఏర్ప‌డ‌బోతోంద‌ని.. ఇది మిస్ జెన్నిఫ‌ర్ ఆధ్వ‌ర్యంలో మ‌రింత పురోగ‌మించాల‌ని పేర్కొన్నారు. భార‌త్‌-అమెరికా సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అయ్యేదిశ‌లో హైద‌రాబాద్ కాన్సులేట్ ముందుండాల‌ని ఆకాంక్షించారు. మిస్ జెన్నిఫ‌ర్ లార్స‌న్ ఆధ్వ‌ర్యంలో  భార‌త్‌లో అత్యుత్త‌మ కాన్సులేట్ గా  హైద‌రాబాద్ గొప్ప ఖ్యాతి గ‌డిస్తుంద‌ని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌తోపాటు హైద‌రాబాద్‌లో ఉంటున్న వారికి వీసాల ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంత‌మవుతుంద‌ని తెలిపారు. ఉద్యోగాలు, ఉన్న‌త విద్య‌, వ్య‌పార నిమిత్తం అమెరికాకు వ‌చ్చే వారికి హైద‌రాబాద్ అమెరిక‌న్ కాన్సులేట్ ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న‌ప్ప‌టికీ మాతృదేశం పై మమకారంతో , రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకుని , రెండు దేశాల అభివృద్ధిలో పాలుపంచుకోవ‌డం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామ‌ని  రవి పులి తెలిపారు. 


ర‌వి పులికి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు..

తెలంగాణ‌కు చెందిన ఎన్నారై వ్యాపార దిగ్గ‌జం ర‌వి పులికి అమెరిక‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన “ప్రెసెడెంట్ వాలంటరీ అవార్డు” లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డును హైద‌రాబాద్ అమెరిక‌న్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ మిస్ జెన్నిఫ‌ర్ లార్స‌న్ అంద‌జేశారు. అమెరికాలో గ‌త 25 ఏళ్లుగా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో ర‌వి పులి ముందున్నారు. ముఖ్యంగా కోవిడ్ స‌మ‌యంలో ఆయ‌న అందించిన సేవ‌లు అనిత‌ర సాధ్య‌మ‌ని ప‌లువురి ప్ర‌శంస‌లు పొందారు. ప్ర‌త్యేకంగా విమానం ఏర్పాటు చేసి ఎంతో మంది భార‌తీయుల‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు. అమెరికాలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న భార‌తీయులకు ర‌వి పులి ఆప‌న్న హ‌స్తం అందించారు. ఎంద‌రో భార‌తీయుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప సామాజిక సేవ‌కుడిగా ర‌వి పులిని ఇప్ప‌టికీ చాలా మంది గుర్తుచేసుకుంటారు. 


ఒంట‌రిగా అమెరికా వెళ్లి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించ‌డ‌మే కాకుండా..  ఎంతోకొంత స‌మాజానికి తిరిగి ఇవ్వాల‌నే ఉత్త‌మ సంక‌ల్పంతో అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డుపుతున్నారు. గ‌త 25 ఏళ్లుగా ఆయ‌న చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అమెరిక‌న్ ప్ర‌భుత్వం గుర్తించి.. లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించింది. అమెరిక‌న్ ప్రభుత్వం ద్వారా లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు అందుకోవ‌డంపై ప‌లువురు ఎన్నారైలు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. భార‌తీయుల‌కు ద‌క్కిన గౌర‌వంగా అభివ‌ర్ణించారు.


జెన్నిఫర్ మాట్లాడుతూ తెలుగు వారిని అందరిని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని.. మీ అందరి సహకారం తో రెండు దేశాల మధ్య ఒక ఆహ్లాదకర వాతావరణాన్ని కల్గించడానికి నా వంతు సహాయం చేస్తానని అన్నారు.  వచ్చే నవంబర్‌లో, ఆసియాలోనే అతి పెద్ద కాన్సులేట్  హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నామని , ఇక్కడ 55 వీసా విండోస్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ స‌మ‌యంలో  నెమ్మ‌దించిన‌ వీసా జారీ ప్ర‌క్రియ‌ను పెంచడానికి మా శాయశక్తులా కృషి చేయబోతున్నామని అన్నారు.   అనంతరం ప్రతి సంవత్సరం  అమెరికాలో  సమాజానికి చేసే   ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఇచ్చే “ప్రెసెడెంట్ వాలంటరీ అవార్డు” ని రవి పులి గెలుచుకోవడం సంతోషంగా ఉందని జెన్నిఫర్ పేర్కొన్నారు. 


5,279 గంటల వాలంటరీ సమయాన్ని రవి పులి , సమాజ హితం కోసం కేటాయించడం చాలా గర్వించదగిందని అమెరికా అధ్యక్షులు తమ అవార్డు సందేశంలో పేర్కొన్నార‌ని తెలిపారు. ప్రెసిడెంట్ బైడెన్ అవార్డు సందేశాన్ని చదివి వినిపించారు. అలాగే అవార్డు తో పాటు ఇచ్చే బటన్ ని రవి పులికి బహుకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో భార‌త కాన్సులేట్ ఎక‌నామిక్ విభాగం మినిస్ట‌ర్ డాక్ట‌ర్ కోట ర‌వి, గ్రాన్యుయ‌ల్స్ ఫార్మా ప్రెసిడెంట్‌, ఇమిగ్రేష‌న్ లాయ‌ర్లు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్బంగా ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు అడిగిన వీసా సంబంధిత ప్ర‌శ్న‌ల‌కు మిస్ జెన్నిఫ‌ర్ లార్స‌న్ ఉత్సాహంగా స‌మాధానాలు ఇచ్చారు. హైద‌రాబాద్ అమెరిక‌న్ కాన్సులేట్ కార్యాల‌య విధుల్లో ఎటువంటి అవ‌స‌రం ఉన్నా తాము ముందుంటామ‌ని స‌మావేశానికి హాజ‌రైన తెలుగువారు హామీ ఇచ్చారు. సీఐఐ, సిగ్గీ, యూఎస్ - ఇండియా కౌన్సిల్‌, యూఎస్ - ఇండియా చిన్న‌త‌ర‌హా వ్య‌పార వేత్త‌ల కౌన్సిల్‌, ఇండియ‌న్ ఎంబ‌సీ ప్ర‌తినిధులు, ప‌లువురు శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌కు చెందిన నిపుణులు పాల్ల‌గొన్నారు. 

Read more