US లో ఘోరం.. అక్కడి తుపాకీ కల్చర్‌కు బలైన తెలుగు యువకుడు!

ABN , First Publish Date - 2022-06-23T13:17:56+05:30 IST

ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో అమెరికాకు వెళ్లిన నల్లగొండకు చెందిన ఓ యువకుడు అక్కడి తుపాకీ కల్చర్‌కు బలయ్యాడు. పట్టణంలోని వివేకానందనగర్‌ కాలనీకి చెందిన నక్కా సాయిచరణ్‌ (26)ను మేరీలాండ్‌లో దుండగులు కాల్చి చంపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 4:30గంటల సమయంలో...

US లో ఘోరం.. అక్కడి తుపాకీ కల్చర్‌కు బలైన తెలుగు యువకుడు!

అమెరికాలో నల్లగొండ యువకుడి హత్య

నల్లజాతీయుడి కాల్పుల్లో యువ ఇంజనీర్‌ సాయిచరణ్‌ మృతి

కారులో వెళ్తుండగా దాడి చేసిన దుండగులు

మేరీలాండ్‌లోని క్యాటన్స్‌విల్‌లో ఘటన

నల్లగొండలో విషాదఛాయలు

నల్లగొండ, జూన్‌ 22: ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయంతో అమెరికాకు వెళ్లిన నల్లగొండకు చెందిన ఓ యువకుడు అక్కడి తుపాకీ కల్చర్‌కు బలయ్యాడు. పట్టణంలోని వివేకానందనగర్‌ కాలనీకి చెందిన నక్కా సాయిచరణ్‌ (26)ను మేరీలాండ్‌లో దుండగులు కాల్చి చంపారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున 4:30గంటల సమయంలో నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండలోని వివేకానందనగర్‌ కాలనీ వాసులైన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కుమారుడైన సాయిచరణ్‌ రెండేళ్ల క్రితం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయిన అనంతరం మేరీలాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ సిటీలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్విరాన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలో ఉద్యోగం సాధించారు. ఈ ఏడాది జనవరి 2న విధుల్లో చేరారు. ఈ నెల 19వ తేదీ ఉదయం తన స్నేహితుడిని విమానాశ్రయంలో వదిలిపెట్టిన అనంతరం కారులో వెళ్తున్న సమయంలో ఓ నల్ల జాతీయుడు తుపాకీతో సాయిచరణ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాలోని హరేగాన్‌ సిటీలో ఉంటున్న సోదరి హారికకు అక్కడి అధికారులు సమాచారం అందించడంగా ఆమె తన సమీప బంధువుల ద్వారా సోమవారం రాత్రి తల్లిదండ్రులకు తెలియజేశారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. 


సాయిచరణ్‌ తండ్రి నర్సింహ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2019లో ఉద్యోగ విరమణ చేశారు. వివేకానందనగర్‌ కాలనీలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి.. సాయిచరణ్‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సాయిచరణ్‌ మృతదేహాన్ని త్వరలోనే నల్లగొండకు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాట్లు చేయిస్తానన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయ అధికారులతో, మంత్రి కేటీఆర్‌తో భూపాల్‌రెడ్డి మాట్లాడారు. సాయిచరణ్‌ మృతదేహం ఈ నెల 25న నల్లగొండకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమెరికాలోని తానా అసోసియేషన్‌తో పాటు ఎన్విరాన్‌ సివిల్‌ ఇంజనీర్‌ కంపెనీ యాజమాన్యం కూడా మృతదేహాన్ని నల్లగొండకు పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. 


నవంబరులో ఇంటికి వస్తానని చెప్పి..

‘‘నవంబరులో ఇంటికి వస్తానని చెప్పితివి.. శవమై తిరిగి వస్తున్నావా నాన్నా..!’’ అంటూ సాయిచరణ్‌ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఈ నెల 17న సాయిచరణ్‌ ఫోన్‌ చేశాడని, నాన్నా ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచించాడని తండ్రి నర్సింహ కన్నీటి పర్యంతమయ్యారు. అమెరికాలో విచ్చలవిడిగా గన్‌కల్చర్‌ ఉండడమే తమ కుమారుడి మృతికి కారణమైందని, ఆ దేశంలో చదువులు, ఉద్యోగం కోసం వెళ్తున్న పిల్లలను ఆ ప్రభుత్వం కాపాడాలని వేడుకున్నారు. తన కుమారుడిని అమెరికా పంపాలని అనుకోలేదని, ఇండియాలోనే ఏదో ఉద్యోగం చేసుకుంటే సరిపోతుందని అనేకసార్లు నచ్చజెప్పిచూశామని, ఏడాదిపాటు బతిమలాడినా.. డబ్బులు లేకపోవడంతో పంపించలేదని నర్సింహ చెప్పారు.ఉద్యోగ విరమణ తరువాత నగదు రావడంతో కుమారుడి కోరికను కాదనలేక పంపించానన్నారు. ఆ డబ్బులు రాకపోయినా బాగుండేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.


సెల్‌ఫోన్‌ మెసేజ్‌కి స్పందించకపోవడంతో..

సాయిచరణ్‌ తల్లిదండ్రులు ప్రతిరోజూ కుమారుడికి ఫోన్‌ మెసేజ్‌ పెట్టి బాగోగులు తెలుసుకుంటారు. సాయిచరణ్‌కు వీలైనప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతుండేవాడు. అయితే సాయిచరణ్‌ హత్యకు గురైన తర్వాత సోమవారం రాత్రి 10:30 గంటలకు వారి బంధువులు సాయిచరణ్‌కు ప్రమాదం జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని చెప్పారు. కుమారుడు ఆస్పత్రిలో ఉన్నాడన్న ఆవేదనతో తల్లి పద్మ.. కుమారుడి ఫోన్‌కు మెసేజ్‌లు పంపించింది. అయినా  స్పందన రాకపోవడంతో ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది. ఎందుకురా కొడకా మాతో మాట్లాడాలనిపించడం లేదా? అంటూ మరొక మెసేజ్‌ పంపినప్పటికీ అటునుంచి స్పందన రాలేదంటూ ఆ తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. 

Read more