Kuwait: వచ్చే ఏడాది మరింత మంది ప్రవాసులను సాగనంపేందుకు వ్యూహం.. కువైత్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్‌బ్లాక్ కావాల్సిందే..!

ABN , First Publish Date - 2022-10-11T13:49:50+05:30 IST

స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy)ని గల్ఫ్ దేశం కువైత్ గడిచిన ఏడాది కాలంగా కఠినంగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు కీలక శాఖల్లో వలసదారులకు బదులుగా కువైటీలను నియమించడం ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ఈ పాలసీని...

Kuwait: వచ్చే ఏడాది మరింత మంది ప్రవాసులను సాగనంపేందుకు వ్యూహం.. కువైత్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే మైండ్‌బ్లాక్ కావాల్సిందే..!

కువైత్ సిటీ: స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ (Kuwaitization policy)ని గల్ఫ్ దేశం కువైత్ గడిచిన ఏడాది కాలంగా కఠినంగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు కీలక శాఖల్లో వలసదారులకు బదులుగా కువైటీలను నియమించడం ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ఈ పాలసీని గట్టిగానే అమలు చేస్తోంది. దేశంలో ప్రవాసుల ప్రాబల్యం అంతకంతకు పెరుగుతుండడం, స్థానికులకు ఉపాధి దొరకడం కష్టతరం కావడంతో అప్రమత్తమైన కువైత్ సర్కార్.. ఈ సమస్య మునుముందు ఇంకా తీవ్రతరం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే వలసదారులకు రెసిడెన్సీ వీసా, వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణకు కఠిన షరతులు విధిస్తూ పొమ్మనలేక పోగ పెడుతోంది. దాంతో గడిచిన ఏడాది కాలంగా చాలా మంది ప్రవాసులు ఆ దేశాన్ని విడిచివెళ్లడం జరిగింది. 


ఇదిలాఉంటే.. వచ్చే ఏడాది మరింత మంది వలసదారులను దేశం నుంచి సాగనంపేందుకు కువైత్ మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికోసం సివిల్ సర్వీస్ కమిషన్ (Civil Service Commission) ఇప్పటికే ప్రణాళిక రెడీ చేసింది. దీనిలో భాగంగా అంతగా అవసరం లేని ఉద్యోగాలకు ప్రవాసుల వర్క్ పర్మిట్లను పునరుద్ధరణ చేయకూడదని నిర్ణయించింది. అంతేగాక మార్కెట్‌లో అవసరమైన వృత్తిపరమైన ఉద్యోగాలకు మాత్రమే వర్క్ పర్మిట్‌లను జారీ చేయనుంది. అది కూడా వృత్తిపరమైన టెస్టులకు లోబడి వర్క్ పర్మిట్ల జారీ, పునరుద్ధరణ ఉంటుందని సీఎస్‌సీ వెల్లడించింది. అలాగే అంతర్గత మంత్రిత్వశాఖ సమన్వయంతో ఉల్లంఘనదారులను గుర్తించి వారి స్పాన్సర్లతో జరిమానాలు కట్టించి మరీ దేశం నుంచి సాధ్యమైనంత త్వరగా పంపించి వేయాలనే నిర్ణయానికి సివిల్ సర్వీస్ కమిషన్ వచ్చిందని అక్కడి మీడియా పేర్కొంది. ఇలా 2023లో భారీ సంఖ్యలో వలసదారులను వారివారి దేశాలకు పంపించేందుకు కువైత్ వ్యూహం రచిస్తోంది.    

Updated Date - 2022-10-11T13:49:50+05:30 IST