ప్రాణాలు తీసిన ఈత సరదా.. Kazakhstan లో తెలుగు యువకుడి మృతి!

ABN , First Publish Date - 2022-07-09T15:00:04+05:30 IST

కజకిస్తాన్‌లో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రాణాలు తీసిన ఈత సరదా.. Kazakhstan లో తెలుగు యువకుడి మృతి!

కర్నూల్: కజకిస్తాన్‌లో తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. సరదాగా ఈతకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు అతడు ఎంబీబీఎస్‌ చదువుతున్న కళాశాల నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పొట్లపాడుకు చెందిన పి.ప్రసాద్, మేరీ కుమారి దంపతుల కుమారుడు పి.వినయ్‌ కుమార్‌(23) కజకిస్తాన్‌లోని ఆల్మమట్టి నగరంలో ఉన్న కజక్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం మూడో ఏడాది పరీక్షలు ముగిశాయి. ఈ క్రమంలో ఈ నెల 7న(గురువారం) స్నేహితులతో కలసి సమీపంలో ఉన్న ఓ కుంటలో సరదాగా ఈతకు వెళ్లాడు.


ఇదే వినయ్ కుమార్ ప్రాణాలు తీసింది. నీటిలోకి దూకే సమయంలో అదుపు తప్పి రాయికి గుద్దుకున్నాడు. అందులోనూ తల నేరుగా వెళ్లి రాయికి కొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని మొదట స్నేహితులు వినయ్‌ కుమార్‌ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ తరువాత అతడు చదువుతున్న మెడికల్‌ యూనివర్సిటీ కూడా యువకుడి మరణాన్ని ధ్రువీకరిస్తూ సమాచారం అందించింది. వినయ్ కుమార్ మరణంతో స్వస్థలం పొట్లపాడులో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో వారు రోదిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.    

Read more