పేదల ఆహారభద్రతకే మోదీ ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి జయ్‌శంకర్

ABN , First Publish Date - 2022-09-12T00:14:53+05:30 IST

దేశంలోని పేదలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ యస్. జయశంకర్ పెర్కోన్నారు.

పేదల ఆహారభద్రతకే మోదీ ప్రభుత్వం పెద్ద పీట: మంత్రి జయ్‌శంకర్

పెరిగిన దరఖాస్తులతో పాస్‌పోర్టుల జారీలో జాప్యం

పేదల రేషన్‌పై మోదీ ప్రత్యేక శ్రద్ధ

ఇంటింటికి నల్లా నీరు, పేదల జనధన్ అకౌంట్లో డబ్బులు

సౌదీ పర్యటనలో విదేశాంగ మంత్రి జయశంకర్


ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దేశంలోని పేదలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ యస్. జయశంకర్(S.Jaishankar) పెర్కోన్నారు. ఈ దిశగా దేశంలోని రేషన్ షాపుల వ్యవస్థపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన అన్నారు. మూడు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం సాయంత్రం ప్రవాసీయులను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కాలంలో దేశంలోని పేదవారెవ్వరూ ఆకలితో మరణించకూడదన్న కృతనిశ్చయంతో ప్రధాని మోదీ పని చేసారని అన్నారు. పేదలు ఆకలితో నిద్రపోకూడదనే ఉద్దేశ్యంతో 80 మిలియన్ల మందికి రేషన్ సరఫరా చేసారని, పేదల గురించి ప్రపంచంలో ఏ ఇతర ప్రధాని ఇంతగా పట్టించుకోలేదని ఆయన కొనియాడారు. 


అకస్మాత్తుగా వచ్చిన కరోనా ఆపద నుండి బయటపడటమే కాకుండా దేశంలో ప్రజలందరికీ స్వయాన భారత ఉత్పాదక వాక్సిన్‌ను కూడా అందరికీ ఉచితంగా పంపిణీ చేసిన ఘనత మోదీకి దక్కుతుందని జయశంకర్ అన్నారు. దేశంలోని పేదలందర్నీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం జన్‌ధన్ యోజన తీసుకొచ్చిందని, కరోనా కాలంలో అందులో 40 మిలియన్ల మంది ఖాతాలలో ప్రభుత్వం డబ్బు జమ చేసిందని మంత్రి అన్నారు. ‘ఘర్ ఘర్ కు జల్’ పథకం కింద దేశంలోని ప్రతి ఇంటికి పైపు లైను ద్వారా నీటి సరఫరా చేసే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా జయశంకర్ తన ప్రసంగంలో పెర్కోన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, దాని ప్రభావం భారత్‌పై కూడా పడిందని చెప్పారు.

        


గల్ఫ్ దేశాలలో భారత్‌కు ఉన్న చారిత్రాత్మక సంబంధాలను మెరుగుపర్చడంలో గతంలో జాప్యం జరిగిందని, కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక అన్ని గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన పెర్కోన్నారు. పాస్‌పోర్టుల జారీ వేగవంతంగా జరుగుతోందని, ప్రస్తుతం 60 శాతం వరకు దరఖాస్తులు పెరిగాయని,  దీంతో కొంత ఆలస్యం జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి అన్నారు. వ్యక్తిగత వివరాల మార్పులు ఉంటే సహజంగా పోలీసు విచారణ అవసరమని, పోలీసు విచారణలో కొన్ని రాష్ట్రాలు వేగంగా స్పందిస్తున్నాయని, మరికొన్ని జాప్యం చేస్తున్నాయని ఆయన అన్నారు. దరఖాస్తుల సంఖ్య పెరిగినా పాస్ పోర్టు కార్యాలయాలలో సిబ్బంది సంఖ్య పెరగలేదని ఆయన వెల్లడించారు. సౌదీ అరేబియాతో సహా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ నిబద్దత, నైపుణ్యతతో దేశానికి గౌరవ ప్రతిష్ఠలు సంపాదించి పెడుతున్నారని ఆయన ప్రశంసించారు. సౌదీ అరేబియాలో పని చేస్తున్న  25 లక్షల మంది భారతీయులు తమ వ్యవహార శైలీ ద్వారా స్థానిక అరబ్బులపై దేశానికి ఒక సదభిప్రాయం కల్గిస్తున్నారని జయశంకర్ అన్నారు.


ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుండి అంటోని రెబల్, సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పర్వీన్, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, తెలుగు ప్రవాసీ ప్రముఖులు ముబీన్, డాక్టర్ అష్రఫ్, దమ్మాం ప్రవాసీ ప్రముఖులు జహీర్ బేగ్ ఇతరులు పాల్గోన్నారు. 

Updated Date - 2022-09-12T00:14:53+05:30 IST