NRI: కొత్తగా అమెరికాకు వెళ్లారా.. ఈ పని మాత్రం చేయకండి..

ABN , First Publish Date - 2022-11-24T23:41:17+05:30 IST

అమెరికాకు కొత్తగా వెళ్లినవారు పాటించాల్సిన ఆర్థికసూత్రాలు

NRI: కొత్తగా అమెరికాకు వెళ్లారా.. ఈ పని మాత్రం చేయకండి..

కొత్తగా అమెరికాకు(USA) వెళ్లిన వారికి డాలర్లలో సంపాదన, ఖర్చులు కొత్తగా అనిపిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ(Financial discipline) విషయంలో కొన్ని చిక్కులూ ఎదురవుతాయి. ప్రతి డాలర్‌ ఖర్చు లేదా సంపాదనను రూపాయిల్లో కొలుస్తూ తికమకకు లోనవుతుంటారు. కానీ..ఇలా అస్సలు చేయవద్దని అక్కడ స్థిరపడిన భారతీయులు చెబుతారు. అమెరికా, భారత్‌లో జీవన వ్యయాలు వేరువేరుగా ఉంటాయని అంటారు.

అమెరికాలో ఖర్చుచేసే డాలర్లను రూపాయిల్లో కొలవద్దని ఎన్నారైలు చెబుతుంటారు. స్వదేశంలోని పరిస్థితుల కంటే అమెరికాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియా కంటే అమెరికాలో కార్లు చాలా చవక. భారత్‌లో 80 లక్షలు ఖరీదు చేసే ఓ కారు అమెరికాలో 60 వేల డాలర్లకే వస్తుంది. ఇక ఇండియాలో 80 లక్షలకు కార్‌ లోన్ తీసుకుంటే..నెలవరీ ఈఎంఐలు ఆకాశాన్నంటుతాయి. కానీ.. అమెరికా కార్‌ లోన్ ఈఎమ్ఐలు అక్కడి సగటు నెలసరి ఆదాయంలో సగటున పది శాతంగా ఉంటాయట.

అమెరికాలో లేబర్ చార్జీలు భారీగా ఉంటాయి కాబట్టి ఎవరి ఇంటి పనులు వారే చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇండియాలో నెలకు 3 వేల చెల్లిస్తే.. ఇంటిపని అంతా చేసిపెట్టేందుకు మనుషులు దొరకుతారు. కానీ.. అమెరికాలో ఇలా చేయించుకునేందుకు వర్కర్లకు ప్రతి రెండు గంటలకు గరిష్ఠంగా 40 డాలర్ల వరకూ చెల్లించాలి.

అమెరికాలో అందే జీతంలో వీలైనంత ఎక్కువగా పొదుపు చేయాలనేది అధిక శాతం మంది ఇచ్చే సలహా. దీంతోపాటూ.. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడంపై కూడా దృష్టిపెట్టాలి. అమెరికాలో నివసించే అందరికీ ఇచ్చే సోషల్ సెక్యూరిటీ నెంబర్‌కు క్రెడిట్ స్కోర్ లింక్ అయి ఉంటుంది. అమెరికాలో జరిపే ఏ ఆర్థిక లావాదేవీకైనా సోషల్ సెక్యూరిటీ నెంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి.

ఇక అమెరికా ఆర్జనని స్వదేశంలో పెట్టుబడిగా పెట్టాలని కూడా అనుభవజ్ఞులైన ఎన్నారైలు చెబుతారు. డాలర్-రూపాయి మారకం(Exchange Rate) విలువను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయని అంటారు.

అంతేకాకుండా..భార్యాభర్తలిద్దరూ సంపాదన పరులైతే.. పొదుపే చేసుకునే అవకాశం మరింత పెరుగుతుంది. కాబట్టి..ఇలాంటి జంటలకు చక్కని ఆర్థికప్రణాళికలు వేసుకునే అవకాశం చిక్కుతుంది.

Updated Date - 2022-11-24T23:42:57+05:30 IST