పెళ్లయ్యాక విదేశాల్లో యువతి కాపురం.. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లికి వీడియో కాల్! ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-06-12T02:23:30+05:30 IST

విదేశాల్లో భర్త వేధింపులతో నరకం చవిచూస్తున్న ఓ వివాహితను ముంబై పోలీసులు సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగన వారు కేవలం ఆరు రోజుల్లో ఆమెను భారత్‌కు రప్పించగలిగారు.

పెళ్లయ్యాక విదేశాల్లో యువతి కాపురం.. భర్త వేధింపులు తట్టుకోలేక తల్లికి వీడియో కాల్! ఆ తరువాత..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో భర్త వేధింపులతో నరకం చవిచూస్తున్న  ఓ వివాహితను ముంబై పోలీసులు సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగన వారు కేవలం ఆరు రోజుల్లో ఆమెను భారత్‌కు రప్పించగలిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ యువతికి(25) ఇటీవలే వివాహం అయ్యింది. అయితే.. భర్తకు కాంగో(ఆఫ్రికా దేశం)లో ఉద్యోగం రావడంతో 45 రోజుల క్రితం ఆమె ఆఫ్రికాకు పయనమైంది. అక్కడ విమానం దిగాక.. తల్లికి ఫోన్ చేసి ప్రయాణం సవ్యంగా సాగిందని చెప్పింది. ఆ తరువాత నుంచి కూతురికి సంబంధించి ఏ సమాచారమూ తల్లికి అందలేదు. దీంతో.. ఏం చేయాలో పాలుపోక ఆమె కంగారు పడిపోయింది. 


ఇటీవల ఓ రోజు బాధిత యువతి హఠాత్తూగా తల్లికి ఫోన్ చేసిన భర్త తనను వేధిస్తున్నాడంటూ వాపోయింది. తనపై చేయి చేసుకుంటున్నాడని, తన ఫోను కూడా తీసేసుకున్నాడని చెప్పుకొచ్చింది. తన ఇంట్లోని పనిమనిషి సాయంతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నానని చెప్పింది. తనను ఎలాగైన భారత్‌కు తీసుకెళ్లాలని వేడుకుంది.  దీంతో.. యువతి తల్లి వెంటనే మీరా భాయందర్ పోలీస్‌ స్టేషన్ జూన్ 3న ఫిర్యాదు చేసింది. తన కూతురిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని వేడుకుంది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు కాంగోలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. ఈ క్రమంలో.. రాయబార కార్యాలయం వారు యువతి భర్త పని చేస్తున్న కార్యాలయాన్ని సంప్రదించి జరిగిన విషయం గురించి చెప్పారు. ఆ తరువాత.. ఆమెను మరో సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం.. జూన్ 9న ఆమెను విమానంలో భారత్‌కు పంపించారు. శుక్రవారం బాధిత యువతి సురక్షితంగా తల్లి చెంతకు చేరుకుంది. కాగా..  యువతిని రక్షించే క్రమంలో వేగంగా స్పందించిన పోలీసులపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. Read more