NRI Couple Pain: Germany లో ఎన్నారై దంపతులకు వింత కష్టం.. ప్లీజ్.. మా కూతుర్ని మాకివ్వండంటూ వేడుకుంటున్నా..

ABN , First Publish Date - 2022-07-24T00:20:54+05:30 IST

జర్మనీలో ఓ భారతీయ కుటుంబం దీన స్థితి ఇది. అక్కడి అధికారులను వేడుకున్నా.. జర్మనీలోని భారతీయ ఎంబసీని ఆశ్రయించినా కూడా..

NRI Couple Pain: Germany లో ఎన్నారై దంపతులకు వింత కష్టం.. ప్లీజ్.. మా కూతుర్ని మాకివ్వండంటూ వేడుకుంటున్నా..

ఎన్నారై డెస్క్: ఆ చిన్నారి వయసు కేవలం 17 నెలలు. తల్లి పొత్తిళ్లల్లో కేరింతలు కొడుతూ ఆడుకోవాల్సిన వయసది. కానీ.. ప్రభుత్వ సంరక్షణాలయంలో పరాయి వ్యక్తుల మధ్య ఆ చిన్నారి బాల్యం గడిచిపోతోంది. ఇక ఆ బిడ్డను కన్న మాతృమూర్తి మనోవేదనను మాటల్లో వర్ణించడం కష్టం. ఒకటి కాదు.. రెండు కాదు.. 10 నెలలుగా ఆమె తన కన్నబిడ్డకు దూరంగా ఉంటూ నరకం అనుభవిస్తోంది. బిడ్డను ఎలా వెనక్కు తెచ్చుకోవాలో తెలీక ఆ చిన్నారి తండ్రి కూడా దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. జర్మనీలో ఓ భారతీయ కుటుంబం(NRI) ఎదుర్కొంటున్న దీన స్థితి ఇది. అక్కడి అధికారులను వేడుకున్నా.. జర్మనీలోని భారతీయ ఎంబసీని ఆశ్రయించినా కూడా వారికి ఇప్పటివరకూ ఊరట లభించలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


గుజరాత్‌కు(Gujarat) చెందిన భవేశ్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన భార్య ధారా ఓ గృహిణి! 2018 నుంచి భవేశ్ ఉద్యోగరీత్యా తన భార్యతో కలిసి జర్మనీలో(Germany) నివసిస్తున్నారు. 2021లో వారికి ఓ పాప పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇదిలా ఉంటే..  కొన్ని నెలల క్రితం భవేశ్ తల్లిదండ్రులు మనవరాలిని చూసుకునేందుకు జర్మనీ వెళ్లారు. ఈ క్రమంలో ఓ రోజు చిన్నారి మర్మాంగానికి దెబ్బతగలడంతో నెత్తురు కారడం ప్రారంభించింది. దీంతో.. ధార కంగారు పడి వెంటనే తన కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు..  పిల్లల్లో అప్పుడప్పుడూ ఇలా జరగడం సాధరణమని చెప్పారు. మందులు ఇచ్చి పంపించారు. అయితే.. మరుసటి రోజు కూడా బ్లీడింగ్ ఆగకపోవడంతో ధారా తన కూతురిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే.. ఈసారి ఆస్పత్రి వర్గాలు.. చిన్నారుల సంరక్షణ శాఖ(Child protection services) అధికారులకు సమాచారం అందించాయి. చిన్నారిని చూసిన వెంటనే వారు బిడ్డపై లైంగిక దాడి జరిగి ఉండొచ్చని భావించి, ఆ పాపను ప్రభుత్వ సంరక్షణాలయానికి తరలించారు. మరోవైపు.. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో..లైంగిక దాడి జరిగినట్టు రుజువుకాలేదు.  


లైంగిక దాడి ఆరోపణలు రుజువుకాకపోయినా.. 

ప్రభుత్వ దర్యాప్తులో లైంగిక దాడి ఆరోపణలు రుజువుకాకపోవడంతో.. భవేశ్ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక  బిడ్డ తమ చెంతకు చేరుతుందని ఆశపడ్డారు. కానీ.. ప్రభుత్వ అధికారులు మరో మెలిక పెట్టారు.  భవేశ్ దంపతులు తల్లిదండ్రులుగా బిడ్డ బాగోగులు చూసుకునే స్థితిలోనే ఉన్నారని నిరూపించే ‘ఫిట్ టు బీ పేరెంట్స్’ సర్టిఫికేట్ తేవాలని వారికి తేల్చి చెప్పారు. దీంతో.. భవేశ్, ధారా లీగల్ సర్వేసెస్ అథారిటీని ఆశ్రయించారు. ఇప్పటికే ఆ శాఖ అధికారులతో రెండు సార్లు సమావేశమైనా కూడా ఇప్పటివరకూ వారికి ఆ సర్టిఫికేట్ జారీ కాలేదు. 


ఇన్నాళ్లుగా బిడ్డ దూరంగా ఉంటున్న ధారా.. నిత్య నరకం అనుభవిస్తోంది. బిడ్డకు స్తన్యం కూడా అందించలేకపోతున్నానని ఆవేదన చెందుతోంది. ఆ చిన్నారికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్న అధికారుల తీరుపై భవేశ్ దంపతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశంలో ఉంటున్నా కూడా తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఈ సమస్యకు పరిష్కారం కోసం భవేశ్ దంపతులు భారతీయ ఎంబసీని ఆశ్రయించారు. వారిని ఆదుకుంటామని రాయబార కార్యాలయం మాటిచ్చినా కూడా ఇప్పటివరకూ సమస్య పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను వెనక్కు తెచ్చుకునేందుకు వారు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Read more