Layoffs: మీకు హెచ్-1బీ ఉందా.. ట్విటర్, ఫేస్‌బుక్‌లో జాబ్ పోయిందా.. అయితే..

ABN , First Publish Date - 2022-11-11T18:48:44+05:30 IST

ట్విటర్, ఫేస్‌బుక్‌లో జాబ్ పోగొట్టుకున్న భారతీయ హెచ్-1బీ వీసాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన భారతీయ కంపెనీ సీఈఓ.

Layoffs: మీకు హెచ్-1బీ ఉందా.. ట్విటర్, ఫేస్‌బుక్‌లో జాబ్ పోయిందా.. అయితే..

ఇంటర్నెట్ డెస్క్: ఐటీ ఉద్యోగులు(Techies) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ కంపెనీలు వరుసపెట్టి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ట్విటర్‌ను చేజిక్కించుకున్నాక మస్క్(Elon Musk) ఏకంగా.. 3800 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించారు. ఫేస్‌బుక్(Facebook) మాతృసంస్థ మెటా(Meta) కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు కోతలకు దిగింది. రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా తన కార్యాలయాల్లోని 11 వేల మందిని తొలగించింది. జాబ్ పోగొట్టుకోవడం ఎవరికైనా బాధ కలిగించేదే.. అయితే..వర్క్ వీసాలపై పనిచేస్తున్నవారికి ఈ పరిస్థితి మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టింది. వీసా కాలపరిమితి ముగిసే లోపు కొత్త ఉద్యోగం దొరక్కపోతే వీరందరూ సొంత దేశాలకు వెళ్లిపోక తప్పదు. వీళ్లల్లో భారతీయ హెచ్-1బీ వీసాదారులు(H-1b Visa holders) కూడా ఉన్నారు. వాళ్ల డెడ్ లైన్ కేవలం 60 రోజులు. ఆ లోపు కొత్త సంస్థలో చేరకపోతే.. ఇండియాకు రాకతప్పదు.

ఇండియాలో ఉంటున్న సాటి భారతీయులనూ ఈ పరిస్థితి కదిలిస్తోంది. అమెరికాలో ఇండియన్ల వెతలు చూసి చెలించిపోయిన డ్రీమ్ 11 సంస్థ(Dream 11) వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష జెయిన్(Harsh Jain) తాజాగా కీలక ఆఫర్ ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు తన సంస్థలో ఉద్యోగాలు ఇస్తానంటూ ముందుకొచ్చారు. ‘‘మా సంస్థలో టాలెంట్ ఉన్నోళ్లను చేర్చుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. నాయకత్వ అనుభవంతో పాటూ డిజైన్, ప్రాడక్ట్, టెక్ విభాగాల్లో ప్రతిభావంతుల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని చెప్పారు.

1.jpg

ప్రస్తుతం టెక్ కంపెనీలన్నీ రాబోయేవి గడ్డు రోజులేనంటూ భయపడిపోతున్నాయి. భవిష్యత్తును తట్టుకునేందుకు ఖర్చులు తగ్గించుకుంటున్నాయి.. ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ.. హర్ష జైన్ మాత్రం తన సంస్థ ఆర్థిక మూలాలు దృఢంగా ఉన్నాయని చెబుతున్నారు. తన సంస్థలో వారికి ఉద్యోగ భద్రత లభిస్తుందని హమీ ఇస్తున్నారు. ‘‘2022లో అమెరికాలో ఏకంగా 52 వేల పైచిలుకు టెకీలు జాబ్ పోగొట్టుకున్నారు. కాబట్టి.. అమెరికాలో వీసాపై ఉంటున్న భారతీయులందరికీ ఈ విషయాన్ని గుర్తు చేయండి. ఇండియాకు తిరిగి రమ్మనండి. ఇక్కడి సంస్థలను అభివృద్ధి చేయమనండి. టెక్ రంగంలో భారత్ శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2022-11-11T19:36:04+05:30 IST