అమెరికాలో కార్చిచ్చు.. లక్షల డాలర్ల ఖరీదైన భవనాలు అగ్నికి ఆహుతి.. !

ABN , First Publish Date - 2022-05-13T23:47:31+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాగ్వునా నిగ్వేల్ ప్రాంతంలో బుధవారం భారీ కార్చిచ్చు రేగింది.

అమెరికాలో కార్చిచ్చు.. లక్షల డాలర్ల ఖరీదైన భవనాలు అగ్నికి ఆహుతి.. !

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాగ్వునా నిగ్వేల్ ప్రాంతంలో బుధవారం భారీ కార్చిచ్చు రేగింది. లక్షల డాలర్ల ఖరీదైన భవనాలు అనేకం మంటలకు ఆహుతయ్యాయి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఆ ప్రాంతంలోని ఓ స్టీల్ ప్లాంట్ వద్ద మంటలు రేగినట్టు తెలుస్తోంది. చూస్తుండగానే అగ్నికీలలు వేగంగా ఆ ప్రాంతంలో వ్యాపించాయి. సుమారు 200 ఎకరాల మేర మంటలు వ్యాపించాయని ఆరెంజ్ కౌంటీ ఫైర్ అథారిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అనే విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. 


మంటలు చెలరేగడానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కాగా.. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ‘‘ఎంత మేర నష్టం జరిగిందో అంచనా వేసేందుకు అధికారులను పంపించాము. దావానలం ఎందుకు చెలరేగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాం’’ అని ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆపరేషన్స్ విభాగం అసిస్టెంట్ చీఫ్ పేర్కొన్నారు. సమీప కౌంటీల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.  పోలీసు శాఖ అంచనా ప్రకారం.. ఆ ప్రాంతంలో సుమారు 100  గృహాలు ఉన్నట్టు తెలుస్తోంది. పొడి వాతావరణంలో విపరీతంగా వీస్తున్న గాలుల కారణంగా అగ్నికీలలు వేగంగా వ్యాపించాయని అక్కడి అధికారులు తెలిపారు.

Read more