Hyderabadi woman: సౌదీ ఆశతో కేటుగాళ్ల ట్రాప్‌లో చిక్కుతున్న హైదరబాదీ మహిళలు.. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే నరకయాతన

ABN , First Publish Date - 2022-08-20T19:09:15+05:30 IST

ఉపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు.

Hyderabadi woman: సౌదీ ఆశతో కేటుగాళ్ల ట్రాప్‌లో చిక్కుతున్న హైదరబాదీ మహిళలు.. స్వదేశానికి తిరిగి రాలేక అక్కడే నరకయాతన

హైదరాబాద్: ఉపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. అలా వచ్చిన చాలా మంది ఇక్కడ ఉపాధి పొందుతూ తమ బతుకుబండి నడిపిస్తున్నారు. ఐటీ నుంచి మొదలుకొని అన్ని రకాల పరిశ్రమలు హైదరబాద్‌లో ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ఉపాధికి కొరత లేదు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న కొందరు పేదవాళ్ల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంటుంది. దాంతో వారు వేరే గత్యంతరం లేక విదేశాల బాట పడుతున్నారు. అందులో ముఖ్యంగా ముస్లిం మహిళలు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు వారిని దేశం దాటిస్తున్నాయి. వీరిలో అత్యధికులు సౌదీ అరేబియా వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఇలా వెళ్తున్న వారిలో బాగా చదువుకున్నవారు ఉండడం గమనార్హం. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇలా పరాయి దేశం బాటపడుతున్న వారి అవసరాన్ని కొందరు ఏజెంట్లు తమ ఆర్థిక వనరుగా మార్చుకుంటున్నారు. 


లేని ఉద్యోగాన్ని ఉన్నట్టుగా చూపించి, శాలరీ కూడా బాగానే వస్తుందని నమ్మించి వారిని విమానం ఎక్కిస్తున్నారు. తీరా అక్కడి వెళ్లాక మోసపోయామనే విషయం తెలుస్తోంది. ఇక్కడ మధ్యవర్తులు చెప్పిన ఉద్యోగం గానీ, శాలరీ గానీ అక్కడ కనిపించవు. ఇక్కడి నుంచి వెళ్లే మహిళల్లో 90శాతం మంది ఇళ్లలో పని చేయాల్సిందే. ఈ విషయాన్ని ఏజెంట్లు దాచిపెట్టి వారిని మోసపూరితంగా అక్కడికి పంపిస్తున్నారు. అప్పటికే అప్పులు చేసి అక్కడికి వెళ్తున్నారు కావున తిరిగి వచ్చేందుకు మళ్లీ కొంత అప్పు చేయాల్సి ఉంటుంది. అంతేగాక తిరిగి రావడం కూడా అంత సులువుగా జరిగే విషయం కాదు. దాంతో వేరే మార్గంలేక దొరికిన పని చేసుకునేవారు చాలామంది ఉంటారు. ఇలా దొరికిన పని చేసుకునే మహిళలకు అక్కడి యజమానుల వేధింపులు మరో సమస్య. సరిగ్గా జీతాలు ఇవ్వకపోగా, ఎక్కువ సమయం పని చేయించడం, ఎదురుతిరిగితే శారీరకంగా వేధించడం మొదలుపెడతారు. తినడానికి తిండి కూడా సరిగా ఉండదు. చివరికి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని బయటపడితే, తమను మోసం చేసి వెళ్లిపోయిందంటూ పనిమనుషులపై యజమానులు కేసులు పెడతారు. అలా కేసులు నమోదైతే ఇక అక్కడి నుంచి స్వదేశనికి రావడం చాలా సమస్యగా మారుతుంది. 


చివరకు కొంతమంది మాత్రమే ఎన్నో వ్యయప్రయాసల తర్వాత ఎంబసీ అధికారులు, సామాజిక కార్యకర్తల సహాయంతో స్వదేశానికి వస్తున్నారు. ఇప్పటికి చాలా మంది అక్కడే నరకయాతన అనుభవిస్తున్నారు. బయటకు వచ్చేది కొందరు మాత్రమే. తాజాగా ఇదే కోవలో హైదరాబాద్‌లోని అఘాపూరకు చెందిన 26 ఏళ్ల మహిళ కేసు ఒకటి బయటకు వచ్చింది. ఎంఏ ఇంగ్లీష్ పట్టా ఉన్న ఆమెను మధ్యవర్తి ఘోరంగా మోసం చేశాడు. నీ చదువుకు తగ్గ ఉద్యోగమని మాయమాటలు చెప్పి సౌదీకి పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక ఇంట్లో పాచి పనిచేయాల్సి వచ్చింది. ఆమె ఇలా సౌదీలో ఇబ్బందులు పడడానికి కారణం.. ఇంట్లోని పరిస్థితులు. ఆమెకు గతేడాది వివాహమైంది. పెళ్లైన ఆరు నెలలకే భర్త అనారోగ్యం బారినపడ్డాడు. దాంతో భర్త వైద్య ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. వాటిని తీర్చాలంటే ఆమెకు విదేశాలకు వెళ్లకతప్పలేదు. దాంతో స్థానికంగా ఉండే ఓ ఏజెంట్‌ను కలిసింది. ఆ ఏజెంట్ రియాద్‌లో ఆమె విద్యార్హతకు సరిపోయే ఉద్యోగం ఉందని, జీతం కూడా బాగానే వస్తుందని ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె రియాద్ వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ చెప్పినట్లు ఏ ఉద్యోగం ఆమెకు దొరకలేదు. ఒకరివద్ద పనిమనిషిగా చేయాల్సి వచ్చింది. 


దానికి ఆమెకు సదరు యజమానికి జీతం ఇవ్వలేదు. అలా ఎనిమిది నెలలు గడిచిపోయాయి. పైగా భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదట. దాంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఎంబసీకి వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో ఎంబసీ అధికారులు ఆమెను దమ్మామ్‌లోని ఉమెన్ షెల్టర్ హోంకు తరలించారు. ఆమె మాదిరిగానే హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన మెహరున్నీసా(31) అనే మరో మహిళ కూడా బ్యూటీషియన్ పని అంటూ సౌదీ వెళ్లింది. కానీ, ఆమెను కూడా ఇంట్లో పాచి పనులు చేయించారు. దాంతో మెహరున్సీసా కూడా అక్కడి నుంచి తప్పించుకుని రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమెను కూడా ఉమెన్ షెల్టర్ హోంకు తరలించడం జరిగింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురు మహిళలు ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ చేరారు. ఈ ఆరుగురిని ఎంబసీ అధికారి ఎస్ఆర్ సంజీవ్, కేరళ రాష్ట్రానికి చెందిన కమ్యూనిటీ వర్కర్ నాస్ వొక్కం, ఇతర ప్రవాసుల సహాయంతో ఈ నెల 17న (బుధవారం) సౌదీ నుంచి భారత్‌కు పంపించారు.    

Read more