అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన దొంగ.. America నుంచి పోలీసులను అలర్ట్ చేసిన ఓనర్.. తర్వాత జరిగింది ఇదీ!

ABN , First Publish Date - 2022-03-10T22:20:39+05:30 IST

తాళం వేసిన ఇంటిపై కన్నేసిన దొంగ.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ ఇంటికి కన్నం వేసేందుకు రెడీ అయ్యాడు. తాళం బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి లోపల నుంచి తలుపులకు తాళం వేశాడు. అనంతరం తన పని

అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన దొంగ.. America నుంచి పోలీసులను అలర్ట్ చేసిన ఓనర్.. తర్వాత జరిగింది ఇదీ!

ఎన్నారై డెస్క్: తాళం వేసిన ఇంటిపై కన్నేసిన దొంగ.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళ ఇంటికి కన్నం వేసేందుకు రెడీ అయ్యాడు. తాళం బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి లోపల నుంచి తలుపులకు తాళం వేశాడు. అనంతరం తన పని మొదలు పెట్టాడు. లాకర్ పగలగొట్టి ఉన్నదంతా ఊడ్చేయబోయాడు. అంతా అనుకున్నట్టే జరిగితే.. ఆ దొంగ భారీ మొత్తాన్ని దోచుకునేవాడేమో. కానీ కథ అడ్డం తిరిగింది. అమెరికాలో ఉన్న ఇంటి ఓనర్.. దొంగను చూశాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


హైదరాబాద్‌కు చెందిన వెంకట రమణ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. కేబీహెచ్‌బీలోని రోడ్ నెంబర్ 2లో వెంకట రమణకు ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఎప్పుడూ తాళం వేలాడటాన్ని రామకృష్ణ అనే వ్యక్తి గమనించాడు. దానిపై కన్నేసిన అతడు ఇంటిని దోచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే బుధవారం అర్ధారాత్రి 2గంటల ప్రాంతంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం లోపల నుంచి గడియపెట్టుకున్నాడు. తర్వాత తన పని ప్రారంభించాడు. లాకర్ ఎక్కడుందో వెతికి.. చేతికి పని చెప్పాడు. లాకర్ పగలగొట్టే సమయంలో శబ్దాలు రావడంతో.. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి నిద్రలేచాడు. వెంటనే యూఎస్‌లో ఉంటున్న వెంకట రమణకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో కంగారుపడ్డ వెంకట రమణ.. ఇంట్లో ఫిక్స్ చేసిన సీసీ కెమెరాలను పరిశీలించాడు. అందులో కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తిని గమనించి.. వెంటనే కేబీహెచ్‌బీ పోలీసులను అలర్ట్ చేశాడు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రామకృష్ణపై గతంలో కూడా దొంగతనానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని అధికారులు తమ విచారణలో తెలుసుకున్నారు. ఈ మధ్యే అతడు సంగారెడ్డి జిల్లాలోని కంది పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైనట్టు గుర్తించారు.   
Read more