Manila airport: ఇంటి యజమాని నిర్వాకం.. 2రోజులుగా ఎయిర్‌పోర్టులోనే హైదరాబాద్ అమ్మాయి.. దేశం కాని దేశంలో ఆపసోపాలు!

ABN , First Publish Date - 2022-08-05T18:04:52+05:30 IST

దేశం కాని దేశంలో హైదరాబాద్‌ (Hyderabad) కు చెందిన ఓ అమ్మాయి ఆపసోపాలు పడుతోంది.

Manila airport: ఇంటి యజమాని నిర్వాకం.. 2రోజులుగా ఎయిర్‌పోర్టులోనే హైదరాబాద్ అమ్మాయి.. దేశం కాని దేశంలో ఆపసోపాలు!

మనీలా: దేశం కాని దేశంలో హైదరాబాద్‌ (Hyderabad) కు చెందిన ఓ అమ్మాయి ఆపసోపాలు పడుతోంది. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ (Philippines) వెళ్లిన ఆమె రాత్రంతా మనీలా ఎయిర్ పోర్టు (Manila airport)లోనే ఉండిపోయింది. ఆమె పాస్‌పోర్ట్ బ్లాక్ అయిందని విమానాశ్రయ అధికారులు ఆమెను నిలిపివేశారు. తిరిగి ఇండియా (India)కు వెళ్లిపోవాలని చెప్పారు. ఆమె లగేజీ కూడా తీసుకుని, తిరిగి భారత్‌కు వెళ్తేగానీ ఇవ్వమని అధికారులు చెబుతున్నట్లు వాపోయింది. హైదరబాద్‌కు చెందిన నవ్య దీప్తీ అనే అమ్మాయికి ఈ సమస్య ఎదురైంది. అయితే, ఫిలిప్పీన్స్‌లో తాను నివాసం ఉండే ఇంటి యజమాని (House Owner) వల్లే ఇలా జరిగిందని, తనకు ఎలాగైనా సరే న్యాయం చేయాలంటూ అధికారులను నవ్య వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం నవ్య దీప్తి హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లింది.  అక్కడి మనీలా విమానాశ్రయంలో దిగిన నవ్యను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె పాస్ పోర్టు బ్లాక్ అయ్యిందని తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్య పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ (Passport)ను కావాలనే బ్లాక్‌ చేశారని నవ్య ఆరోపిస్తోంది.


మెడిసిన్ చదువుతున్న నవ్య.. ఫిలిప్పీన్స్‌లోని మనీలా ప్రాంతంలో రెండేళ్లుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే, కరోనా సమయంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్‌ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని, డబ్బులు కట్టనందుకు పాస్‌పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తోంది. ఫిలిప్పీన్స్‌ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్‌ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపింది. ఒకసారి తన ఇంటి యజమాని ఇంటికి వెళ్లి విచారించాలని కోరింది. ఇప్పుడు అర్థాతరంగా ఇంటికి పంపిస్తే తన చదువు మధ్యలో ఆగిపోతుందని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. అధికారులు ఒకసారి తన భవిష్యత్‌ను దృష్టిపెట్టుకుని అసలు తన పాస్‌పోర్ట్ ఎలా బ్లాక్ అయిందో విచారించాలని కోరుతోంది.   


మూడేళ్లుగా ఫిలిప్పీన్స్‌ (Philippines)లో ఉంటున్న నవ్య కరోనా (Corona) సమయంలో 2020లో స్వదేశానికి వచ్చేసింది. ఆ సమయంలో తాను ఇంటి యజమానికి రూ.40వేలు ఇంటి అద్దె చెల్లించాల్సి ఉందని, స్వదేశానికి వచ్చిన వెంటనే వాటిని చెల్లించినట్లు తెలిపింది. అయితే, ఇంటి యజమాని మరో రూ.40వేలు అధికంగా ఇవ్వాలని, లేనిపక్షంలో ఆమె పాస్‌పోర్ట్ బ్లాక్ చేయిస్తానని బెదిరించినట్లు నవ్య చెప్పుకొచ్చింది. ఇంటి ఓనర్ ఫిలిప్పీన్స్ పాస్‌పోర్ట్ కార్యాలయంలోనే పనిచేస్తారని, ఇది కచ్చితంగా యజమాని పనేనని ఆమె ఆరోపించింది. ఇక మొన్నటి నుంచి ఎయిర్ పోర్టులోనే ఉన్న తనకు కనీసం లగేజీ కూడా ఇవ్వడం లేదని వాపోయింది. అధికారులు తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. 

Updated Date - 2022-08-05T18:04:52+05:30 IST