NRI: ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా’ అంశంపై ‘వీధి అరుగు’ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-11-21T19:30:15+05:30 IST

‘వీధి అరుగు-నార్వే’ వేదిక ఆధ్వర్యంలో నవంబరు మాసాంతపు కార్యక్రమంగా నవంబరు 20 సాయంత్రం ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా?’ అనే అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది.

NRI: ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా’ అంశంపై ‘వీధి అరుగు’ కార్యక్రమం

ఐరాస వారు ఈజిప్ట్‌లో వాతావరణ సదస్సు నిర్వహించి, పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు. అదేవిధంగా, నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరుపురుగు చెట్టును బలహీనపరిచినట్టు, నేటిసమస్యలు, భాషను బలహీనపరచి, భావితరాలను భాషకు దూరం చేసే అవకాశం ఉంది. ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు నేర్పడం, ఇంకా సంక్లిష్టమైనది. ‘వీధి అరుగు-నార్వే’ వేదిక ఆధ్వర్యంలో నవంబరు మాసాంతపు కార్యక్రమంగా నవంబరు 20 సాయంత్రం ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా?’ అనే అంతర్జాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ రంగంలో విశేష కృషి చేసిన డా. గీతామాధవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి, అద్భుతంగా ప్రసంగించారు. ఈ కార్యక్రామంలో దాదాపు 15 దేశాలు నుంచి తెలుగువారు పాల్గొని విజయవంతంచేశారు. ఈ కార్యక్రమానికి నార్వే నుంచి ప్రముఖ వ్యాఖ్యాత అయిన గాయత్రి గోవిందరాజు అనుసంధానకర్తగా వ్యవహరించారు. మొదటగా జర్మనీ నుండి ఆరేటిమోహన్‌ స్వాగతవచనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

డా. గీతామాధవి ప్రసంగం ఆద్యంతమూ ఆకట్టుకున్నది. వారి ప్రతిభను, అనుభవాన్ని రంగరించి, ఎన్నో విషయాలను, సరళంగా విశదీకరించారు.

తెలుగు అక్షరాలు మహేశ్వరుని ఢమరుకము నుంచి ఎలా పుట్టాయో, పాణిని అష్టాధ్యాయి నుంచి ఉదాహరించి, ఉత్పత్తిస్థానము ఆధారంగా అక్షరాలను ఎలా వర్గీకరించారో తెలియజెప్పి, పిల్లలకు ఆసక్తికలిగేలా, వృత్తాల ఆధారంగా అక్షరాలను ఎలా వ్రాయవచ్చు అనే చిట్కాలునేర్పి, పాటల రూపంలో కూడా ఆడుతూ పాడుతూ పిల్లలకు తెలుగు ఎలా నేర్పవచ్చో తేట పరిచారు. డా. గీతామాధవి మాట్లాడుతూ “తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు కదా. అలా కాకుండా, ఇటాలియన్ భాషనే తెలుగు ఆఫ్‌ది వెస్ట్ అనే స్థాయికి తెలుగు ఎదగాలనే అశాభావాన్ని వ్యక్త పరిచారు".

మా “వీధి అరుగు” వేదిక ద్వారా తెలుగు నేర్పించడం కోసం భవిష్యత్కార్యాచరణకు ఒక ఆప్నిచేయ సంకల్పించామని నిర్వాహకులు తరిగోపుల వెంకటపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దీర్ఘాసి విజయభాస్కర్, విక్రమ్ సుఖవాసి, డా. గుంటుపల్లి శ్రీనివాస్, మల్లేశ్వరరావు, నిరంజని స్వేడెన్‌ తెలుగు కమ్యూనిటీ, కామేశ్వరశర్మ, రామకృష్ణ ఉయ్యురు, లక్ష్మణ్, అన్నపూర్ణ మహీంద్ర, తొట్టెంపూడి గణేష్, తర్రా అప్పలనాయుడు, వెంకట్, కామేశ్వర శర్మ, బాలాజీయాదవ్, రవితేజ గుబ్బ తదితరులు పాల్గొన్నారు.

పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి https://www.youtube.com/watch?v=b5sClgt_PgA

Updated Date - 2022-11-21T19:42:39+05:30 IST