Green Card: భారతీయులకు తీపి కబురు​.. మరింత ఈజీగా గ్రీన్​కార్డు.. ఇకపై ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు!

ABN , First Publish Date - 2022-09-30T13:45:23+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో నివసించే భారతీయులకు జో బైడెన్ (Joe Biden) సర్కార్ తీపి కబురు చెప్పింది. యూఎస్‌లో శాశ్వతనివాస హోదాను కల్పించే గ్రీన్​కార్డు (Green Card) కోసం ఇకపై ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. గ్రీన్​కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికన్ కాంగ్రెస్​లో డెమొక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యులు ప్రవేశపెట్టారు.

Green Card: భారతీయులకు తీపి కబురు​.. మరింత ఈజీగా గ్రీన్​కార్డు.. ఇకపై ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నివసించే భారతీయులకు జో బైడెన్ (Joe Biden) సర్కార్ తీపి కబురు చెప్పింది. యూఎస్‌లో శాశ్వతనివాస హోదాను కల్పించే గ్రీన్​కార్డు (Green Card) కోసం ఇకపై ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. గ్రీన్​కార్డులకు సంబంధించిన కీలక బిల్లును అమెరికన్ కాంగ్రెస్​లో డెమొక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యులు ప్రవేశపెట్టారు. వలసదారులు కనీసం ఏడేళ్లు అమెరికాలో నివసిస్తే.. గ్రీన్‌కార్డు జారీ చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లును సెనేటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశపెట్టారు. సెనేటర్​లు బెన్​ రే లుజన్​, ఎలిజిబెత్​ వారెన్​, విప్ డిక్ డర్బిన్ బలపరిచారు. ఈ బిల్లు వల్ల ప్రవాసులకు భారీ లబ్ధి చేకూరనుంది. ఇక గ్రీన్​కార్డు బిల్లు ఆమోదం పొందితే వలసదారులు ఏడు సంవత్సరాలకే శాశ్వతంగా అగ్రరాజ్యం నివసించేందుకు గ్రీన్​కార్డు లభిస్తుంది. ప్రధానంగా ఆ దేశంలో భారీ సంఖ్యలో నివసిస్తున్న భారత్‌, చైనా లాంటి దేశాల ప్రవాసులకు భారీ ప్రయోజనం ఉంటుంది.


కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సెనేటర్​ అలెక్స్ పాడిల్లా మాట్లాడుతూ.. "పాత ఇమ్మిగ్రేషన్ విధానం ద్వారా మిలియన్ల మంది ప్రవాసులు నష్టపోయారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ బిల్లు ద్వారా 80లక్షల మంది వలసదారులకు భారీ ఊరట లభించనుంది. కొంతమంది వలసదారులు దశాబ్దాలుగా అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. దేశం కోసం పనిచేస్తున్నారు. దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు. అలాంటి వారికి స్వేచ్ఛగా అమెరికా​లో జీవించడానికి అనుమతించే హక్కును కల్పించేందుకే గ్రీన్​కార్డు బిల్లును ప్రవేశపెట్టాం." అని అన్నారు. 


ఇక ఈ బిల్లు చట్టంగా మారితే హెచ్-1బీ వీసాదారులు (H-1B Visa Holders), దీర్ఘకాలం వీసాపై పని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్‌కార్డు డ్రీమర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటివరకు దేశాల వారీగా కోటా ప్రకారం అగ్రరాజ్యం జారీ చేస్తున్న గ్రీన్‌కార్డు కోసం వీరు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తుంది. ఇలా ఏళ్ల తరబడి శాశ్వతనివాస హోదా కోసం నిరీక్షణలో ఉన్నవారిలో భారతీయ నిపుణులు అత్యధికంగా ఉన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు అమలైతే మనోళ్ల పంట పండినట్టే. ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగిన భారత్‌, చైనా వలసదారుల కష్టాలు తీరనున్నాయి.

Updated Date - 2022-09-30T13:45:23+05:30 IST