NRI: మా దేశానికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కోండి.. జర్మనీ బంపర్ ఆఫర్..

ABN , First Publish Date - 2022-09-21T04:37:03+05:30 IST

దేశాల్లో ఉద్యోగం చేయాలంటే ముందుగా అక్కడి కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ మన చేతిలో ఉండాలి. అప్పుడే వీసా లభిస్తుంది. కానీ..అలాంటి నిబంధనలు ఏమీ లేకుండానే జర్మనీ ప్రభుత్వం జాబ్ సీకర్ వీసా ప్రోగ్రామ్‌తో విదేశీయులను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

NRI: మా దేశానికి వచ్చి ఉద్యోగాలు వెతుక్కోండి.. జర్మనీ బంపర్ ఆఫర్..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే ముందుగా అక్కడి కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్ మన చేతిలో ఉండాలి.  అప్పుడే వీసా లభిస్తుంది. కానీ..అలాంటి నిబంధనలు ఏమీ లేకుండానే జర్మనీ ప్రభుత్వం జాబ్ సీకర్ వీసా ప్రోగ్రామ్‌తో(Job seeker Visa) విదేశీయులను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కారణం.. అక్కడ నిపుణులైన ఉద్యోగుల కొరత ఉండటమే. ఈ లోటును విదేశీయులతో భర్తి చేయాలనేది జర్మనీ యోచన. 


ఏమిటీ జాబ్ సీకర్ వీసా..

ఈ వీసా పొందిన వారు ముందుగా జర్మనీకి చేరుకుని ఆ తరువాత ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఈ వీసా పరిమితి కేవలం ఆరు నెలలు. ఈ లోపు జర్మనీలో నివసించేందుకు ఈ వీసాదారులకు అనుమతి ఉంది.  ఈలోపే ఉద్యోగం లభిస్తే..ఆ తరువాత జర్మనీలో పనిచేసుకునేందుకు వర్క్ వీసాగానీ లేదా వర్క్ పర్మిట్ గానీ ఇస్తారు. జర్మనీ యూనిర్శిటీలు ఇచ్చే బాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీకి సమానమైన విదేశీ డిగ్రీ ఉన్నవారే దీనికి అర్హులు. 


అంతేకాకుండా.. దరఖాస్తుదారులకు తమ వృత్తిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జర్మనీలో ఆరు నెలలు గడిపేందుకు సరిపడా డబ్బు ఉందని కూడా దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి. ఈ వీసాపై జర్మనీ వెళ్లాలనుకున్న వారు.. తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లు, పాస్‌పోర్టు, జర్మనీలో ఉద్యోగం ఎలా సంపాదించబోతున్నారో వివరిస్తూ లేఖ రాయాల్సి ఉంటుంది. ఈవీసాతో విదేశీయులకు పెద్ద సంఖ్యలో జర్మనీలోకి తీసుకురావచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కల్పించే ఉచిత విద్య, వైద్య సదుపాయాలన్నీ వారికి  అదనపు ఆకర్షణగా మారతాయనేది ప్రభుత్వం తలంపుగా ఉంది. ఇక వలసల విధానానికి(Immigration) కీలక మార్పులు చేసేందుకు జర్మనీ(Germany) ప్రభుత్వం సిద్ధమైంది. విదేశీయులకు దేశంలో కాలుపెట్టిన మూడేళ్లకే పౌరసత్వం(Citizenship) ఇచ్చేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా జర్మనీ సమాజంలో సులువుగా ఇమిడిపోయే వారికి ఈ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దేశంలో నెలకొన్న కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రస్తుతం జర్మనీ విదేశీయలు వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఓ అంచనా ప్రకారం..2026 నాటికి 8 కోట్ల మంది కార్మికుల కొరత ఏర్పడనుంది. 

Read more