UAE: యూఏఈలో మల్టీపుల్ ఎంట్రీకి వీలు కల్పించే.. ఈ 4 వీసాల గురించి ప్రవాసులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

ABN , First Publish Date - 2022-09-13T14:16:03+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) ప్రస్తుతం ప్రవాసులకు అనేక రకాల 'బహుళ ప్రవేశ' వీసాలను అందిస్తోంది. ఇవి విదేశీయులను ఈ దేశం అందించే నాణ్యమైన జీవనాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వీసాలు ప్రవాసులు వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబాలు, సహాయక సిబ్బందితో కలిసి పలుమార్లు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తాయి.

UAE: యూఏఈలో మల్టీపుల్ ఎంట్రీకి వీలు కల్పించే.. ఈ 4 వీసాల గురించి ప్రవాసులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) ప్రస్తుతం ప్రవాసులకు అనేక రకాల 'బహుళ ప్రవేశ' వీసాలను అందిస్తోంది. ఇవి విదేశీయులను ఈ దేశం అందించే నాణ్యమైన జీవనాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ వీసాలు ప్రవాసులు వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబాలు, సహాయక సిబ్బందితో కలిసి పలుమార్లు దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తాయి. అయితే, వీటిలో నాలుగు వీసాలు మాత్రం వలసదారులను చాలా ఆకర్షిస్తున్నాయి. ఈ నాలుగు వీసాల దరఖాస్తు విధానం, అర్హతలు, వీటితో కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు చూద్దాం..


1. గోల్డెన్ వీసా (Golden Visa)

పదేళ్ల కాలపరిమితితో ప్రవాసులకు యూఏఈ గోల్డెన్ వీసాను అందిస్తోంది. అయితే, ఇది అందరికీ ఇవ్వరు. భారీ పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, అత్యుత్తమ విద్యార్థులు మరియు గ్రాడ్యుయేట్లు, వ్యవస్థాపకులు, అసాధారణమైన ప్రతిభావంతులైన వ్యక్తులతో పాటు వివిధ రంగాల నిపుణులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వీసా ఉన్నవారు వారి వయస్సుతో సంబంధం లేకుండా వారి కుటుంబాలను, అలాగే సహాయక సిబ్బందిని స్పాన్సర్ చేయవచ్చు. అంతేగాక యూఏఈ వెలుపల ఉండే గరిష్ట వ్యవధిపై కూడా ఎటువంటి పరిమితి ఉండదు.


2. గ్రీన్ వీసా (Green Visa)

ఈ కొత్త ఐదేళ్ల బహుళ ప్రవేశ రెసిడెన్సీ వీసాను ఇటీవలే యూఏఈ ప్రకటించింది. ఇది వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన ప్రవాసులకు అందించబడుతుంది. ఈ వీసా పొందిన వారు స్పాన్సర్ లేదా యజమాని అవసరం లేకుండా దేశంలో నివాసం ఉండేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం దరఖాస్తుదారులు చెల్లుబాటయ్యే ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. అది కూడా మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం మొదటి, రెండవ లేదా మూడవ వృత్తిపరమైన స్థాయిలో వర్గీకరించబడిన ఉద్యోగాన్ని కలిగి ఉండాలి. ఇక కనీస విద్యార్హత తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన ఇతర విద్యార్హతైన ఉండాలి. అలాగే జీతం 15వేల దిర్హమ్స్ (రూ.3.24లక్షలు) కంటే తక్కువ ఉండకూడదు.


3. పదవీ విరమణ వీసా (Retirement visa)

ఈ మల్టీపుల్ ఎంట్రీ వీసా ఐదు సంవత్సరాల కాలపరిమితితో వస్తుంది. 55ఏళ్లకు పైబడిన ప్రవాసులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే మూడు సందర్భాల్లో ఈ వీసాను రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వాటిలో ఒకటి ఆ దేశంలో కనీసం Dh2 మిలియన్ల (రూ.4.32కోట్లు) పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమతను కలిగి ఉండడం. రెండోది Dh1 మిలియన్ (రూ. 2.16కోట్లు) కంటే తక్కువకాకుండా బ్యాంక్ సేవింగ్స్ ఉండడం. లేదా నెలకు 20వేల దిర్హమ్స్ (రూ. 4.32లక్షలు) కంటే తక్కువ కాకుండా క్రియాశీల ఆదాయం కలిగి ఉండడం. ఈ మూడు సందర్భాల్లో పదవీ విరమణ వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. 


4. బహుళ ప్రవేశ పర్యాటక వీసా (Multiple-entry tourist visa)

యూఏఈలోని పర్యాటక సంస్థలచే స్పాన్సర్ చేయబడిన సాధారణ పర్యాటక వీసాతో పాటు తాజాగా ఐదేళ్ల బహుళ ప్రవేశ పర్యాటక వీసా ప్రవేశపెట్టబడింది. ఈ వీసాకు స్పాన్సర్ అవసరం లేదు. ఇది ఓ వ్యక్తిని 90 రోజుల పాటు నిరంతరంగా ఆ దేశంలో ఉండడానికి అనుమతిస్తుంది. ఇక వీసాతో మొత్తం బస వ్యవధి ఒక ఏడాదిలో 180 రోజులకు మించకుండా ఉంటే మాత్రం అంతే వ్యవధికి పొడిగించుకునే వెసులుబాటు ఉంది. కాగా, ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక షరతు ఉంది. వీసా దరఖాస్తు చేసుకోవడానికి ముందు గత ఆరు నెలల కాలంలో 4వేల డాలర్లు లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుంది.

Read more