US Congress: మధ్యంతర ఎన్నికల బరిలో ఐదుగురు భారతీయ అమెరికన్లు

ABN , First Publish Date - 2022-11-06T10:36:28+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మనోళ్లు ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి కాంగ్రెస్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా ఇతర పలు కీలక పదువుల్లో కొనసాగుతున్నారు.

US Congress: మధ్యంతర ఎన్నికల బరిలో ఐదుగురు భారతీయ అమెరికన్లు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే మనోళ్లు ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి కాంగ్రెస్ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా ఇతర పలు కీలక పదువుల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో నవంబర్‌ 8న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లోనూ పలువురు భారతీయ అమెరికన్లు బరిలో నిలిచారు. భారత సంతతికి చెందిన ఐదుగురు రాజకీయ నేతలు అమెరికా ప్రతినిధుల సభ (US Congress) రేసులో ఉన్నారు. వారే.. అమీ బేరా (Ami Bera), రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi), రో ఖన్నా (Ro Khanna), ప్రమీలా జయపాల్ (Pramila Jayapal)‌, శ్రీ థానేధర్ (Shri Thanedar). వీరిలో అమీబేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు మళ్లీ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. వీరు నలుగురు కూడా అధికార డెమొక్రాటిక్ పార్టీకి (Democratic Party) చెందిన వారే. వీరి విజయం నల్లేరుమీద నడకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక అమీ బేరా వీరందరిలోనూ సీనియర్. కాలిఫోర్నియాలోని (California) 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ఏకంగా ఆరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనతో పాటు కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి రో ఖన్నా బరిలో ఉన్నారు. అటు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌లోని (Illinois) 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రమీలా జయపాల్ వాషింగ్టన్‌ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా నాల్గోసారి బరిలో నిలిచారు. ఈ నలుగురూ తమ రిపబ్లికన్ ప్రత్యర్ధులపై చాలా ఈజీగా గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సమోసా కాకస్‌గా పిలవబడే మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త శ్రీథానేధర్‌ తొలిసారి పోటీపడుతున్నారు. మొదటిసారి బరిలో నిలిచిన శ్రీ థానేధర్ కూడా విజయం సాధించే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది.

Updated Date - 2022-11-06T10:58:04+05:30 IST