కెనడాలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-14T18:19:40+05:30 IST

కెనడాలోని 'శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ' షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్, ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ దేవి నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

కెనడాలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

ఎన్నారై డెస్క్: కెనడాలోని 'శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ' షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ నిర్వాహకులు లలిత, శైలేష్, ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ దేవి నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థాపకురాలు లలిత స్వయం సేవకులు మాధవి నిట్టల, మాధవి చల్ల, శోభన సహకరించగా అనఘా అమ్మవారికి ప్రతిరోజు స్వర్ణ కవచ, బాలా త్రిపుర సుందరి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి, లలిత త్రిపుర సుందరి, మహా లక్ష్మీ, సరస్వతి, దుర్గ మహిషాసుర మర్దిని, శ్రీ రాజ రాజేశ్వరి అలంకారాలతో వివిధ రూపాల్లో దేవి శోభ ఉట్టిపడేలా అందంగా అలంకరించారు. ప్రధానార్చకులు రాజ్‌కుమార్ శర్మ అమ్మవారికి ప్రతి ఉదయం షిర్డీ బాబా అభిషేకం, అమ్మవారి అభిషేకం, సర్వతో భద్ర, లింగాలతో భద్ర పూజలు, గణపతి, నవగ్రహ, శ్రీ రుద్ర, మహా విష్ణువు, మహా లక్ష్మి, సరస్వతి, దుర్గా జపము, హోమములు జరిపించారు. ప్రతిరోజు సాయంత్రం షిర్డీ సాయిబాబా వారి హారతులు, అమ్మవారి లలిత సహస్రనామ, ఖడ్గమాల, కనకధారా స్తోత్రం సహిత కుంకుమార్చనలు, చతుర్వేద పారాయణం, సకలరాజోపచార పూజలు, హారతులు ప్రతి నిత్యం నిర్వహించారు. 


పాడ్యమి నాడు చిన్న పిల్లలకి బాలపూజలు, కన్య పూజలు నిర్వహించారు. మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ, అక్షరాభ్యాసాలు, దుర్గాష్టమి నాడు సుహాసిని పూజలు, మహర్నవమి నాడు మహిషాసుర మర్ధిని పూజ, విజయ దశమి నాడు మరకత రాజరాజేశ్వరి పూజలు ఘనంగా జరిగాయి. నవరాత్రి శుభసందర్భంగా తొమ్మిది రోజులు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. కెనడా శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ మందిర ఆధ్వర్యంలో కెనడాలో గత ఐదేళ్లుగా పంచాయతన యాగాలు, లలిత సహస్రనామ కోటి కుంకుమార్చన యజ్ఞం, షిరిడి బాబా గారి పాదుక యాత్రలతో పాటు అనేక దైవ, ఆధ్యాత్మిక సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ భగవత్ సంకల్పముతో, ఎంతో మంది వాలంటీర్లు ఉత్తర అమెరికా ఖండంలో నివసిస్తున్న స్వయంసేవకుల సహాయంతో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన డైరెక్టర్ లలిత పేర్కొన్నారు. అచంచలమైన ధృడ విశ్వాసం, దైవ నమ్మకమే అన్నింటికి పునాది అని లలిత తెలిపారు.

Updated Date - 2022-10-14T18:19:40+05:30 IST