ఆ 60 మంది ప్రవాసులను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కువైత్ నిర్ణయం.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-27T15:47:50+05:30 IST

ఇటీవల కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతోంది. వలసదారులు (Expats) ఏ చిన్న తప్పు చేసి దొరికిన వెంటనే దేశం నుంచి బహిష్కరించడం (Deportation) చేస్తోంది.

ఆ 60 మంది ప్రవాసులను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని కువైత్ నిర్ణయం.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..

కువైత్ సిటీ: ఇటీవల కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతోంది. వలసదారులు (Expats) ఏ చిన్న తప్పు చేసి దొరికిన వెంటనే దేశం నుంచి బహిష్కరించడం (Deportation) చేస్తోంది. దేశంలో రోజురోజుకు ప్రవాసుల ప్రాబల్యం పెరుగుతుండడం, స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదనే నేపంతో వలసదారులకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. క్రమం తప్పకుండా ప్రవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో ఉల్లంఘనదారులను గుర్తించి వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇదే కోవలో తాజాగా 60 మంది ప్రవాసుల విషయంలోనూ అదే నిబంధనను అమలు చేసింది. చట్ట విరుద్ధంగా ట్యాక్సీ సర్వీసులు నడిపిస్తున్న 60 మంది వలసదారులను గుర్తించిన ట్రాన్స్‌పోర్ట్ అధికారులు వారిని బహిష్కరణ కేంద్రాలకు తరలించారు. 


ఈ 60 మంది గత కొంతకాలంగా తమ సొంత వాహనాలను క్యాబ్స్‌గా మార్చి విమానాశ్రయం నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండా వారు చట్ట విరుద్ధంగా క్యాబ్ సర్వీసులు నడిపినందుకు వెంటనే వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్  డైరెక్టర్ జనరల్ యూసఫ్ అల్ ఖద్దా (Yousef Al-Khadda) సంబంధిత అధికారులకు ఆదేశించారు. దాంతో వారిని బహిష్కరణ కేంద్రాలకు తరలించారు. కాగా, ఉల్లంఘనదారుల్లో అత్యధికులు భారత్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వాసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బహిష్కరణ కేంద్రాల్లో ఉన్న వీరిని సాధ్యమైనంత త్వరగా వారివారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని మేజర్ జనరల్ యూసఫ్ అల్ ఖద్దా తెలిపారు. 

Read more