NRI: కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన చైనా

ABN , First Publish Date - 2022-11-11T21:44:10+05:30 IST

చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలను మరింతగా సడలించింది. విదేశీ పర్యాటకులు, వారి సన్నిహితులు చైనా క్వారంటైన్‌లో గడపాల్సిన సమయాన్ని మరింతగా తగ్గించింది.

NRI: కరోనా ఆంక్షలను మరింతగా సడలించిన చైనా

ఎన్నారై డెస్క్: చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలను మరింతగా సడలించింది. విదేశీ పర్యాటకులు, వారి సన్నిహితులు చైనా క్వారంటైన్‌లో గడపాల్సిన సమయాన్ని మరింతగా తగ్గించింది. ఈ మేరకు తన జీరో కోవిడ్ విధానంలో కొన్ని కీలక మార్పులు చేసింది. తాజాగా నిబంధనల ప్రకారం.. చైనాలో విదేశీ పర్యాటకులు ముందుగా హోటల్ లేదా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి వస్తుంది. ఆ తరువాత మరో మూడు రోజుల పాటు ఇంటికే పరిమితమవ్వాలి. విదేశీ పర్యాటకులకు సన్నిహితంగా మెలిగిన వారికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకూ.. మొత్తం పది రోజుల పాటూ విదేశీ పర్యాటకులు క్వారంటైన్‌లో ఉన్న తరువాతే.. తమ చైనా పర్యటన కొనసాగించేవారు. తాజా రూల్స్‌తో చైనా తన కాంటాక్ట్ ట్రేసింగ్ విధానాన్నీ సడలించింది. గతంలో కాంటాక్ట్ ట్రేసింగ్ కారణంగా వేల మంది క్వారంటైన్ కేంద్రాల్లో గడపాల్సి వచ్చేది. విదేశీ ఎయిర్‌లైన్స్‌పై పెనాల్టీ విధించే విధానానికి కూడా చైనా ముగింపు పలికే యోచనలో ఉంది. గతంలో చైనాలోకి వైరస్ ప్రవేశపెట్టిన ఎయిర్‌లైన్స్‌పై చైనా ప్రభుత్వం జరిమానాలు విధించేది. అయితే.. అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిబంధనను ప్రభుత్వం పక్కన పెట్టనుంది.

మరోవైపు.. దాదాపు 1300 మంది భారతీయ విద్యార్థులకు వీసాలను మంజూరు చేసినట్టు చైనా తాజాగా పేర్కొంది. దాదాపు 40 చైనా విద్యా సంస్థలు NOC (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వకుండా భారత విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. విద్యార్థులు చైనాకు వెళ్లేందుకు వీసా పొందాలంటే.. సదరు విద్యా సంస్థలు NOCని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ భారతీయ విద్యార్థులకు చైనా విద్యా సంస్థలు ఆ సర్టిఫికెట్లను జారీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగానే.. విద్యార్థులకు NOC జారీ కాకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంటుందనే వార్తలు వెల్లువెత్తాయి. దీంతో చైనా ఫారెన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి తాజాగా మీడియాతో మాట్లాడారు. విద్యా సంస్థలు ఎన్‌ఓసీ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతుందనే వార్తలను ఖండించారు. అంతేకాకుండా యూనివర్సిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ చైనాకు తిరిగి రావడానికి ఏర్పాట్లు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Updated Date - 2022-11-12T00:03:45+05:30 IST