భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ల్యాండ్‌మైన్లు ఉంటాయి.. కెనడా ప్రభుత్వ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-10-01T02:51:41+05:30 IST

భారత్‌కు(India) వెళ్లాలనుకుంటున్న కెనడా(Canada Tourists) పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం ఓ వింత సూచన చేసింది.

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. ల్యాండ్‌మైన్లు ఉంటాయి.. కెనడా ప్రభుత్వ హెచ్చరిక

ఎన్నారై డెస్క్: భారత్‌కు(India) వెళ్లాలనుకుంటున్న కెనడా(Canada Tourists) పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం ఓ వింత సూచన చేసింది. పాక్‌(Pakistan) సరిహద్దును ఆనుకుని ఉన్న గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా సరిహద్దుకు 10 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో ల్యాండ్‌మైన్లు ఉంటాయని కూడా చెప్పుకొచ్చింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేమని, భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయని పేర్కొంటూ ఓ ప్రకటన(Advisory) విడుదల చేసింది. భారత్‌లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ ఓ ప్రకటనను తన వెబ్‌సైట్‌లో ఉంచింది.


కాగా.. సెప్టెంబర్ 23న కెనడా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసినట్టు సమాచారం. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్నందుకు.. అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ ప్రభుత్వం అదే రోజున ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దీంతో.. భారత్‌కు పోటీగా కెనడా ఈ ప్రకటన చేసిందన్న వాదన వినబడుతోంది. భారత్‌లోని పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేక ఖలిస్థాన్‌ దేశంగా ప్రకటించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల ఓ రెఫరెండం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కెనడాలోని భారతీయులను.. అక్కడ జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాల విషయంలో అప్రమత్తం చేస్తూ అప్పట్లో ఓ ప్రకటన జారీ చేసింది. కాగా.. సిఖ్స్‌ ఫర్ జస్టిస్ సంస్థను కేంద్రం ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం నిషేధించిన విషయం తెలిసిందే.

Read more