జెద్ధాలో జె.టి.యం.. ఎర్ర సముద్ర తీరాన ఎర్రటి పూల మధ్య బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-05T02:29:20+05:30 IST

ఎర్ర సముద్ర తీరాన ఎర్రటి పూల మధ్య బతుకమ్మ వేడుకలు

జెద్ధాలో జె.టి.యం.. ఎర్ర సముద్ర తీరాన ఎర్రటి పూల మధ్య బతుకమ్మ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియా... గల్ఫ్ కూటమిలోనే కాదు అరబ్ దేశాలన్నిటిలోనూ అతి పెద్ద దేశం. తనకంటూ ఒక విశిష్ఠత, ప్రత్యేకత కల్గిన ఈ దేశంలో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నా గల్ఫ్‌లోని మిగిలిన భారతీయుల కంటే ఇక్కడి వారి సాంఘిక జీవన విధానం విభ్నినం. తెలుగు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో ఉంటున్నా వేర్వేరుగా, విభిన్న దృక్ఫథాలతో ఉంటారు. రాజధాని రియాధ్, పారిశ్రామిక నగరం దమ్మాంలలో ఉన్న తెలుగు ప్రవాసీయులతో పోల్చితే వాణిజ్య రాజధాని అయిన జెద్ధాలో ఉంటున్న తెలుగు ప్రవాసీయుల సంఖ్య తక్కువే అయినా సంస్కృతి, ఆచార వ్యవహారాలలో మాత్రం తక్కువేం కాదు. కరోనా ఆంక్షల కారణాన గత మూడేళ్ళుగా సాంస్కృతిక, సాంఘీక జీవన స్రవంతికి అందరి తరహా ఎర్ర సముద్రం తీరాన ఉన్న ఈ నగరం తెలుగు ప్రవాసీయులు కూడా దూరంగా ఉన్నారు. 


కానీ ప్రస్తుతం నవరాత్రులలో భాగంగా జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలతో ఒక్కసారిగా ఇక్కడి తెలుగు ప్రవాసీయులలో నూతన జవసత్వాలు సమకూరాయి. భారతదేశం నుండి నూతనంగా వచ్చిన అనేక కుటుంబాల ఆనంద సంతోషాలకు ఒక్కసారిగా అవధులు లేకుండాపోయాయి. అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఇటీవల జెద్ధా నగరంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ప్రాంతాలకు అతీతంగా తెలుగు మహిళలందరు కలిసి ఒక్కటిగా ఉత్సహాభరితంగా బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. జె.టి.యం అనే తెలుగు ప్రవాసీయుల సంప్రదాయ సంస్థ అధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవం ఒక నూతనోత్తేజాన్ని నింపింది. సుదీర్ఘ కాలంగా ఉంటున్న శారదంబా ప్రోత్సహాం, గాలి దుర్గభవానీల నేతృత్వం ఈ సారి బతుకమ్మ పండుగను మరింత పూలమయం చేసింది.


ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బతుకమ్మను జరుపుకోనే తాను ఈ సారి జరుపుకోవడం లేదనే బాధతో ఉన్న తనకు జెద్ధా నగరంలో బతుకమ్మ ఉయ్యాలో పాడడం జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతి అని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన బుర్ర సవర్ణ జ్యోతి వ్యాఖ్యానించారు. ఈ రకమైన అనేక మంది మహిళలకు అమె ఒక ప్రతీక. అచ్చం తెలంగాణ సంప్రదాయక రీతిలో బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం అమిత ఆనందం కల్గించిందని సవర్ణ చెప్పారు. సవర్ణతో పాటు హైద్రాబాద్ నగరానికి చెందిన కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లాకు చెందిన సౌజన్య, కరీంనగర్‌కు చెందిన వందనలు మోదటిసారిగా బతుకమ్మ పండుగను జరుపుకోన్నారు. జె.టి.యం కృషిను మహిళలందరు అభినందించారు. బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా కాకుండా వారి మధ్యలోనే బతుకమ్మ సంబురాలను జరుపుకోన్నామని సింగరేణి ముఖ్య పట్టణమైన బెల్లంపల్లికు చెందిన సిరికొండ విజయకుమార్ వ్యాఖ్యానించారు. గోలీ శ్రీనివాస్, గొట్టిపాటి రాజశేఖర్, కుంట విద్యాసాగర్, మనిభూషణ్ రావు గల్లా, పడమట కోటి శివరామకృష్ణ, వెంకట్ రంగం సొడగంలు కార్యక్రమ నిర్వహణలో చురుక్కయిన పాత్ర పోషించారు.









Updated Date - 2022-10-05T02:29:20+05:30 IST