CJI NV Ramana: మినీ ఇండియాలో ఉన్నట్లుగా ఉంది.. ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి రావాలి

ABN , First Publish Date - 2022-07-02T16:15:57+05:30 IST

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (CJI NV Ramana) కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.

CJI NV Ramana: మినీ ఇండియాలో ఉన్నట్లుగా ఉంది.. ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి రావాలి

కాలిఫోర్నియా: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ (CJI NV Ramana) కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ఇండో-అమెరికన్లకు ఉద్దేశించి ఇవాళ మినీ ఇండియాలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇండియాలో ఎన్నో మార్పులు జరిగాయని తెలిపారు. మౌలిక సదుపాయాల వృద్ధి శరవేగంగా పెరిగిందని పేర్కొన్నారు. అమెరికాకు రావడమనేది సామాన్యుడికి కలగా ఉండేది. ఇప్పుడది చాలా సులువు అయిపోయిందన్నారు. నూతన ఆవిష్కరణల్లో భారత్‌ ఎంతో ముందుకెళ్లడం గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో ప్రపంచంతో నేడు ఇండియా పోటీ పడే స్థాయికి చేరడం నిజంగా గర్వకారణం అన్నారు. సాంకేతిక ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణలదే అగ్రస్థానం అని తెలిపారు. ఆలోచనల్లో మార్పు రాకపోతే ముందడుగు వేయలేమని చెప్పిన సీజేఐ.. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. 


ప్రజల్లో మార్పు కోసం వ్యవస్థలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం ప్రవాసులు నాయకులుగా ఎదగాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు. సొంత మనుషులను, ఆహారాన్ని, భాషను, సంస్కృతిని వదులుకొని వచ్చినా మీరు (ప్రవాసీలు) సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. సతీ సమేతంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (40 భారతీయ సంఘాల కూటమి) ఆయన కోసం ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA) అధ్యక్షుడు జయరాం కోమటి, ఇతర కార్యవర్గ బృందాలతో పాటు భారీ సంఖ్యలు తెలుగువారు, ఎన్నారైలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-02T16:15:57+05:30 IST