Golden Visa: యూఏఈలో సెటిల్ కావాలా? అయితే, మీకో గోల్డెన్ చాన్స్..!

ABN , First Publish Date - 2022-11-13T07:42:20+05:30 IST

విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యూఏఈ సర్కార్ ఇచ్చే గోల్డెన్ వీసా (Golden Visa) దరఖాస్తు ప్రక్రియ, ఫీజు తదితర వివరాలను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICA) తాజాగా వెల్లడించింది.

Golden Visa: యూఏఈలో సెటిల్ కావాలా? అయితే, మీకో గోల్డెన్ చాన్స్..!

అబుదాబి: విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యూఏఈ సర్కార్ ఇచ్చే గోల్డెన్ వీసా (Golden Visa) దరఖాస్తు ప్రక్రియ, ఫీజు తదితర వివరాలను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICA) తాజాగా వెల్లడించింది. 10ఏళ్ల కాలపరిమితితో ఇచ్చే గోల్డెన్ వీసాకు దరఖాస్తు రుసుమును 50 దిర్హమ్స్‌గా (రూ.1,096) నిర్ణయించింది. విదేశీయులు http://smartservices.icp.gov.ae వెబ్‌సైట్ ద్వారా గోల్డెన్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఐసీఏ సూచించింది. అయితే, గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసే ముందు తమ అర్హతలను ఒకటికిరెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఆప్లికేషన్ సమర్పించాలని తెలియజేసింది.

ఇక గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిభావంతులు, నిపుణులు, ప్రభుత్వ పెట్టుబడులతో పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, హైస్కూల్ గ్రాడ్యుయేట్లు, యూఏఈ వెలుపల ఉన్న గుర్తింపు పొందిన యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు, దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లను మొదట రక్షణ శ్రేణిగా పరిగణించి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఐసీఏ వెల్లడించింది. కాగా, దరఖాస్తులు సమర్పించడానికి అధికారి అథారిటీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్, కస్టమర్ హ్యాపీనెస్ కేంద్రాలు, అథారిటీ ఆమోదించిన టైపింగ్ కార్యాలయాలను సంప్రదించాలని తెలిపింది.

Golden-Visa.jpg

అసలు గోల్డెన్ వీసా అంటే ఏంటి..?

ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.

గోల్డెన్ వీసా ఎవరికిస్తారంటే..

2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు.

10 ఏళ్ల వీసాకు అర్హులు వీరే..

పదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్ల పెట్టుబడి), ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పెట్టుబడిదారులు:

పబ్లిక్ పెట్టుబడులలో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడి అనేక రూపాల్లో ఉండవచ్చు.

* దేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) డిపాజిట్ చేయడం

* యూఏఈలో రూ.20.50కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించడం

* రూ. 20.50కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత, కొత్త కంపెనీలో భాగస్వామిగా చేరడం

షరతులు:

* పెట్టుబడి పెట్టిన ధనం లోన్ రూపంలో తీసుకోని ఉండకూడదు.

* పెట్టుబడులను కనీసం మూడేళ్లపాటు ఉంచాలి.

* రూ.20.50కోట్ల వరకు ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఉండాలి.

వ్యాపార భాగస్వాములకు కూడా ఈ వీసాను అనువర్తింప చేయవచ్చు. అయితే, ప్రతి భాగస్వామి రూ.20.50కోట్లకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలనే షరతు అనురించాల్సి ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒక సలహాదారు ఉండవచ్చు. ఇక విదేశాల నుండి పెట్టుబడిదారులు ఆరు నెలల కాలానికి మల్టీపుల్ ఎంట్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2022-11-13T08:13:16+05:30 IST