కుటుంబం కోసం సౌదీకి.. అక్కడ పక్షవాతం బారిన పడటంతో ఇబ్బందులు.. చివరకు అతడి పరిస్థితి..

ABN , First Publish Date - 2022-11-07T10:01:11+05:30 IST

పేదరికం పొమ్మన్నా పోలేదు, దారిద్ర్యం దారి విడలేదు. అంగడిలో అల్లుళ్ళను కొనే ప్రయత్నంలో ఎడారి దేశానికి వచ్చి రేయింబవళ్ళూ కష్టపడ్డా ఫలితం దక్కలేదు. కూతుళ్ళ కట్నం డబ్బు ఆందోళనతో ఆరోగ్యం క్షిణించగా ఆసుపత్రి..

కుటుంబం కోసం సౌదీకి.. అక్కడ పక్షవాతం బారిన పడటంతో ఇబ్బందులు.. చివరకు అతడి పరిస్థితి..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పేదరికం పొమ్మన్నా పోలేదు, దారిద్ర్యం దారి విడలేదు. అంగడిలో అల్లుళ్ళను కొనే ప్రయత్నంలో ఎడారి దేశానికి వచ్చి రేయింబవళ్ళూ కష్టపడ్డా ఫలితం దక్కలేదు. కూతుళ్ళ కట్నం డబ్బు ఆందోళనతో ఆరోగ్యం క్షిణించగా ఆసుపత్రి పాలై స్వదేశానికి వెళ్ళలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కడప జిల్లాకు చెందిన ఒక ప్రవాసీ తండ్రి అచేతన స్ధితి ఇది. ఈ క్రమంలో భారతీయ వైద్యులు, నర్సుల మానవత సహాయంతో స్వదేశానికి తిరిగి వెళ్ళాడు.

కడప జిల్లా ముద్దనూరుకు చెందిన నందరపు హుస్సేన్ పీరా అనే వ్యక్తి కుటుంబ బాగు కొరకు కొన్నాళ్ళ క్రితం సౌదీ అరేబియాలోని నజ్రాన్ అనే ప్రాంతానికి వచ్చి టైలరింగ్ వృత్తి చేపట్టాడు. ఒక వైపు కరోనా మరోవైపు ఇతరత్రా సమస్యల కారణంతో టైలరింగ్ దుకాణం ఆశించిన స్థాయిలో నడవలేదు. మరో వైపు స్వదేశంలో ఇద్దరు బిడ్డల చదువులు, పెళ్ళిలకు కావాల్సిన డబ్బు జమ కాలేదు. పైగా అప్పులు పెరిగిపోవడంతో ఆయనలో ఆందోళన పెరిగింది. దీంతో ఒక్క ఆయన పక్షవాతం బారినపడ్డారు.

​నజ్రాన్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో విమానశ్రాయానికి వెళ్ళగా కనీసం కూర్చోలేని నిస్సహాయ స్థితిలో ఆయనను విమానయాన ప్రయాణానికి అనర్హుడంటూ విమానశ్రాయ సిబ్బంది వెనక్కి పంపించారు. దీంతో ఆయన మళ్లీ వచ్చి ఆసుపత్రిలో చేరారు. అతడి పరిస్థితి తెలుసుకుని ఆసుపత్రిలో పని చేసే భారతీయ నర్సులు, వైద్యులు చలించిపోయారు. దీంతో ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన చికిత్స చేయడంతోపాటు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి విమాన టికెట్‌ను సమకూర్చి.. అతడి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించచారు. ఆసుపత్రిలో పని చేసే తిరుపతి నగరానికి చెందిన డాక్టర్ పొన్నేరు భాస్కరరెడ్డి ఆయన వెంట ప్రయాణించి.. హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో అతడి కూతుళ్లకు అప్పగించారు. అనంతరం డాక్టర్ పొన్నేరు భాస్కర్‌రెడ్డి తిరిగి సౌదీకి బయల్దేరారు. సౌదీలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా నజ్రాన్ శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భాస్కర్ రెడ్డి ఉదారతను ప్రవాసీయులు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2022-11-07T10:02:16+05:30 IST

Read more