US Citizenship: అమెరికా కీలక ప్రకటన.. గడిచిన 15ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారట!

ABN , First Publish Date - 2022-12-08T18:37:11+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన సుమారు 10లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరసత్వాన్ని(US Citizenship) పొందారట. ఈ విషయాన్ని..

US Citizenship: అమెరికా కీలక ప్రకటన.. గడిచిన 15ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారట!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా కీలక విషయాన్ని వెల్లడించింది. యూఎస్ వెల్లడించిన విషయాన్ని బట్టి.. ఇండియానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల పౌరులు కూడా అమెరికాను తమ గమ్య స్థానంగా భావిస్తున్నట్టు అర్థం అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 30 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన సుమారు 10లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరసత్వాన్ని(US Citizenship) పొందారట. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్(USCIS) బుధవారం రాత్రి ప్రకటించింది.

యూఎస్ పౌరసత్వం(US Citizenship) కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 10.75లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేసినట్టు పేర్కొంది. ఇందులో దాదాపు 9.67లక్షల దరఖాస్తుదారులకు అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేసినట్టు వెల్లడించింది. దరఖాస్తుదారుల పిల్లలను కూడా పరిగణలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య 10.23లక్షలకు పెరుగుతుందని తెలిపింది. దేశాల వారీగా అమెరికా పౌరసత్వాన్ని పొందిన విదేశీ పౌరుల జాబితాను వెల్లడించలేదు. కానీ మెక్సికన్ పౌరులే అత్యధిక సంఖ్యలో యూఎస్ సిటిజన్‌షిప్‌ను పొందినట్టు సమాచారం. ఆ తర్వాత స్థానంలో భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గడిచిన 15ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొందడం ఇదే తొలిసారి. ఈ విషయం యూఎస్‌సీఐఎస్ గణాకాంలను చూస్తే అర్థం అవుతుంది. గత ఏడాది 8.13 లక్షల మంది విదేశీ పౌరులు అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇందులో 14శాతం అంటే 1.13లక్షల మంది మెక్సికన్ పౌరులు ఉన్నారు. గత ఏడాది 57వేల మంది(7శాతం) భారతీయులు యూఎస్ సిటిజన్‌షిప్ పొందారు.

Updated Date - 2022-12-08T19:21:37+05:30 IST