USA: జిమ్‌లో మహిళకు ఊహించని సమస్య.. ఇలాంటి సీన్ మీరెక్కడా చూసి ఉండరు..

ABN , First Publish Date - 2022-09-05T22:01:25+05:30 IST

వ్యాయామశాలలో(Gym) కసరత్తులు చేస్తున్న ఓ అమెరికా మహిళకు ఇటీవల అనూహ్య పరిస్థితి ఎదురైంది. దాన్నుంచి బయటపడేందుకు ఆమె ఏకంగా పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

USA: జిమ్‌లో మహిళకు ఊహించని సమస్య..  ఇలాంటి సీన్ మీరెక్కడా చూసి ఉండరు..

ఎన్నారై డెస్క్: వ్యాయామశాలలో(Gym) కసరత్తులు చేస్తున్న ఓ అమెరికా మహిళకు ఇటీవల అనూహ్య పరిస్థితి ఎదురైంది.  దాన్నుంచి బయటపడేందుకు ఆమె ఏకంగా పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. కడుపుబ్బా నవ్వు తెప్పించే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్(Viral) అవుతోంది. ఒహాయో(Ohio) రాష్ట్రానికి క్రిస్టీన్ ఫాల్డ్స్ అనే మహిళ ఇటీవల ఓ రోజు ఉదయం మూడు గంటల సమయంలో జిమ్‌కు వెళ్లింది. అక్కడ ఓ పరికరం సాయంతో కసరత్తు ప్రారంభించింది. దీనిపై కసరత్తులు చేస్తే వెన్నుముకకు బలం వస్తుంది. అయితే..దీనిపై నిలబడి కసరత్తులు చేసేవారు మొదటతలకిందులై మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు. ఇక తలకిందులుగా ఉన్న సమయంలో వెన్నుముక సాగి.. వీపు భాగానికి బలం చేకూరుతుంది. 


అయితే.. ఈ ఎక్విప్‌మెంట్‌పై కసరత్తులు చేస్తున్న క్రీస్టీన్ మొదట తలకిందులయ్యింది(Upside down) కానీ..సాధారణ స్థితికి మళ్లీ చేరుకోలేకపోయింది.  పరికరంలో ఆమె కాలు ఇరుక్కుపోవడమే దీనికి కారణం. అది తెల్లవారుజాము కావడంతో వ్యాయామశాలలో చాలా తక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా.. ఆ సమయంలో అక్కడ పెద్ద శబ్దంతో పాటలు కూడా ప్లే అవుతున్నాయి. దీంతో.. తనకు సాయం చేయాలంటూ పక్క రూంలో ఉన్న వ్యక్తిని క్రిస్ట్రీన్ పిలిచినా అతడికి వినబడలేదు. దీంతో.. ఏం చేయాలో తేలీక ఇబ్బంది పడ్డ ఆమె చివరకు తన స్మార్ట్ వాచ్ సాయంతో అత్యవసర సిబ్బందికి ఫోన్ చేసింది.  ‘‘నేను తలకిందులుగా ఇరుక్కుపోయాను. జిమ్‌లో నాకు సాయం చేసేందుకు ఎవరూ లేరు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి’’ అని వేడుకుంది. 


ఆమె ఫోన్ అందుకున్న మూడు నిమిషాలకే అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెకు సాయం చేశారు. ఇక క్రిస్టీన్ ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇకపై ఎవరూ లేని సమయాల్లో వ్యాయామశాలకు వెళ్లొద్దని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది. తన ఫాలోవర్లకు కూడా ఇదే సూచించింది. ఇలా తలకిందులుగా చాలా సేపు ఇరుక్కుపోవడంతో తాను ప్రస్తుతం తలనొప్పి వేధిస్తోందని కూడా చెప్పుకొచ్చింది..! ప్రస్తుతం నెట్టింట్లో  ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోను మీరు ఓమారు చూసేయండి.. 





Updated Date - 2022-09-05T22:01:25+05:30 IST