జాలితో బాతులకు ఆహారం పెట్టి.. ఇల్లు కోల్పోయే స్థితిలో పడ్డ వృద్ధ జంట..!

ABN , First Publish Date - 2022-07-10T03:18:55+05:30 IST

జాలితో బాతులకు ఆహారం పెట్టిన ఓ వృద్ధ జంట ఊహించని సమస్యలో చిక్కుకుంది.

జాలితో బాతులకు ఆహారం పెట్టి.. ఇల్లు కోల్పోయే స్థితిలో పడ్డ వృద్ధ జంట..!

ఎన్నారై డెస్క్: జాలితో బాతులకు ఆహారం పెట్టిన ఓ వృద్ధ జంట ఊహించని సమస్యలో చిక్కుకుంది.  కోర్టులో వారిపై దాఖలైన కేసులో ఓడిపోయిన పక్షంలో సొంతిల్లు కూడా కోల్పోవాల్సిన దుస్థితిలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే జార్జి, కాథలీన్ రోవీ దంపతులు టెక్సాస్‌లోని సైప్రిస్ నగరంలో నివసిస్తుంటారు. ఖరీదైన లేక్‌ల్యాండ్ ప్రాంతంలో వారికో సొంతిల్లు ఉంది. ఇటీవల కాలంలో వారు తమ ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న కొన్ని బాతులకు ఆహారం వేయడం ప్రారంభించారు. తమ జీవితమంతా బోనులోనే గడిపిన ఆ బాతులు ఆహారం వెతుక్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాయని భావించి వాటికి ఆహారం ఇవ్వసాగారు. ఇదే వారికి ఊహించని అపాయం తెచ్చి పెట్టింది. 


రోవీ దంపతుల ఇంటి వద్ద బాతుల సంఖ్య పెరుగుతుండడంతో ఇరుగుపొరుగు వారు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాతుల వల్ల ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారిందని, దుర్గంధం వ్యాపించిందని ఆరోపించారు. ఈ క్రమంలో 250,000 డాలర్ల మేర తమకు పరిహారం చెల్లించాలంటూ స్థానిక హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వారు కోర్టులో కేసులు వేశారు. అయితే.. తాము మానవత్వంతోనే స్పందించామని రోవీ దంపతులు చెబుతున్నారు. ఇరుగుపొరుగు వారు ఆరోపించినట్టు ఆ ప్రాంతం అంత అపరిశుభ్రంగా ఏమీ లేదని వాదిస్తున్నారు. అయితే.. ఆ దంపతులు కోర్టులో కేసు ఓడిపోయిన పక్షంలో వారు ఇంత భారీ మొత్తాన్ని పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. పరిహారం చెల్లించని పక్షంలో వారి భవనాన్ని హోమ్ ఓనర్స్ అసోసియేషన్ హస్తగతం చేసుకుంటుంది. 

Read more