US Recession: అగ్రరాజ్యంలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం అంటూ వార్తలు.. భారత టెక్ పరిశ్రమకు దెబ్బ!

ABN , First Publish Date - 2022-07-27T13:49:54+05:30 IST

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని నానుడి. డాలర్‌ మారకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంటుంటారు.

US Recession: అగ్రరాజ్యంలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం అంటూ వార్తలు.. భారత టెక్ పరిశ్రమకు దెబ్బ!

ఈ ఏడాది వరుసగా రెండు త్రైమాసికాల్లో అమెరికా స్థూలజాతీయోత్పత్తిలో తగ్గుదల

హెచ్చరికలు జారీ చేస్తున్న గణాంకాలు

తగ్గిన టెక్‌ కంపెనీల ఈబీఐటీ మార్జిన్లు

లెదర్‌, వస్త్ర పరిశ్రమలకూ తగ్గుతున్న ఆర్డర్లు

అయినా ఆశాభావంతోనే మన టెక్‌ కంపెనీలు 

ఈ సారి వృద్ధి 7.4 శాతమే 

భారత జీడీపీ అంచనాలకు ఐఎంఎఫ్‌ కోత

వాషింగ్టన్‌, జూలై 26: అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని నానుడి. డాలర్‌ మారకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. అమెరికాలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందంటూ వస్తున్న వార్తలు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 1.6 శాతం మేర తగ్గింది. రెండో త్రైమాసికం ఫలితాలు ఈ వారాంతంలో రానున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ఈసారి కూడా జీడీపీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా.. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో ఉద్యోగావకాశాలు బాగా ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అమెరికా వేగంగా అభివృద్ధి చెందే దశ నుంచి స్థిరమైన వృద్ధి దిశగా వెళ్తోందని చెప్పారు. బైడెన్‌ ధీమా సంగతి పక్కన పెడితే.. అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆ ప్రభావం భారతీయ టెక్‌ కంపెనీలపై భారీగానే పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మన టెక్‌ దిగ్గజాలు మాత్రం అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నాయి. ఉదాహరణకు ఇన్ఫోసిస్‌ సంస్థ తన రెవెన్యూ వృద్ధిని 14-16% అంచనా వేస్తోంది. 


గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా కనిపించట్లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మళ్లీ ఇన్ఫోసి్‌సనే ఉదాహరణగా తీసుకుంటే గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంతో పోల్చుకుంటే ఈసారి ఆ సంస్థ రెవెన్యూ వృద్ధి 24%గా ఉన్నా అందులోంచి వడ్డీలు, పన్నుల భారం తీసేస్తే మిగిలింది గత ఏడాదితో పోలిస్తే 3శాతం మాత్రమే ఎక్కువ. విప్రో సంస్థ పరిస్థితీ అం తే. ఆ సంస్థ ఈబీఐటీ(ఎర్నింగ్స్‌ బిఫోర్‌ ఇంట్రెస్ట్‌ అండ్‌ ట్యాక్సె్‌స-వడ్డీలు, పన్నులు కట్టడానికి ముందు ఆర్జన) మార్జిన్‌ 2018 రెండో త్రైమాసికం స్థాయికి పడిపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈబీఐటీ మార్జిన్‌ కూడా 17 శాతానికి తగ్గింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఈబీఐటీ మార్జిన్‌ 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో 2.4 పర్సంటేజ్‌ పాయింట్ల మేర తగ్గింది. పాశ్చాత్య దేశాల్లో ఆర్థిక మాంద్యం వస్తే ఈ సంస్థల లాభాలన్నీ ఒత్తిడిలో పడతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.


తగ్గుతున్న ఆర్డర్లు..

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో అమెరికాకు భారత్‌ 14.3 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. ఇది మన మొత్తం ఎగుమతు ల్లో 18.2%. వచ్చే వేసవి, శీతాకాల సీజన్లకు సంబంధించి అమెరికా నుంచి దిగుమతి ఆర్డర్లు గణనీయంగా తగ్గాయని దేశంలోనే అతి పెద్ద లెదర్‌, లెద ర్‌ పాదరక్షల ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్‌ తెలిపింది. ఆ గ్రూపు వ్యాపారంలో 45-50% అమెరికాతోనే జరుగుతుంది. రెడీమేడ్‌ వస్త్రాల ఎగుమతిదారులు కూడా ఆర్డర్లు భారీగా తగ్గాయంటున్నారు. ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ నోమురా కూడా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై ఉంటుందని గత నెలలోనే అంచనా వేసింది. ఇండియా జీడీపీ వృద్ధి సగటు 2022లో 7.2ు, 2023లో 5.4ు ఉండొచ్చని నోమురా అభిప్రాయపడింది.

Updated Date - 2022-07-27T13:49:54+05:30 IST