Kuwait: వారం రోజుల్లో 409 మంది వలసదారులు అరెస్ట్.. వారిలో 10 మంది మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్..

ABN , First Publish Date - 2022-10-04T16:22:46+05:30 IST

గడిచిన కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait: వారం రోజుల్లో 409 మంది వలసదారులు అరెస్ట్.. వారిలో 10 మంది మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్..

కువైత్ సిటీ: గడిచిన కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తూ ఉల్లంఘనదారులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం చేస్తోంది. అనంతరం వారిని బహిష్కరణ కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి వారివారి దేశాలకు పంపిస్తోంది. ఇలా ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది (Deportion). తాజాగా ఇదే కోవలో మరో 409 మంది వలసదారులను అరెస్ట్ చేసింది. గడిచిన వారంలో పోలీస్, అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో 409 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ సెక్యూరిటీ విభాగం (Public Security Department) వెల్లడించింది. వీరందరూ రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారేనని అధికారులు తెలిపారు. గత వారం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 705 సెక్యూరిటీ చెక్‌పాయింట్స్‌ ద్వారా వీరిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 


ఇలా అరెస్ట్ అయిన వారిలో 10 మంది మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్ కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. ఇక తాము అదుపులో తీసుకున్న 40 మంది ప్రవాసులు యజమానుల నుంచి తప్పించుకుని కనిపించకుండా పోయినవారి జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 164 మంది ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్నట్లు తెలిపారు. అలాగే 53 మంది మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడినట్లు సెక్యూరిటీ అధికారులు చెప్పుకొచ్చారు. ఇలా మొత్తంగా గడిచిన వారం రోజుల్లో 409 మంది వలసదారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజపరుస్తామని, ఆ తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందన్నారు.  

Updated Date - 2022-10-04T16:22:46+05:30 IST