NRI: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్ రావట్లేదని బాధపడుతున్నారా..? అమెరికాలో చదువుకున్న ఈ యువకుడి కథ తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-26T23:33:06+05:30 IST

అమెరికాలో(USA).. అందులోనూ ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీలో(Yale University) చదువుకున్నారంటే.. ఉద్యోగం కచ్చితంగా రావాల్సిందే.. సాధారణంగా అందరూ ఇదే అనుకుంటారు. మరి అంతటి ప్రఖ్యాత యూనివర్శిటీలో చదువుకున్నా కూడా తన కలల ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాల్సి వచ్చిందో చెబుతూ ఓ భారతీయ యువకుడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

NRI: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జాబ్ రావట్లేదని బాధపడుతున్నారా..? అమెరికాలో చదువుకున్న ఈ యువకుడి కథ తెలిస్తే..
వత్సల్ నహాతా

ఎన్నారై డెస్క్: అమెరికాలో(USA).. అందులోనూ ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీలో(Yale University) చదువుకున్నారంటే.. ఉద్యోగం కచ్చితంగా రావాల్సిందే.. సాధారణంగా అందరూ ఇదే అనుకుంటారు. మరి అంతటి ప్రఖ్యాత యూనివర్శిటీలో చదువుకున్నా కూడా తన కలల ఉద్యోగం కోసం ఎన్ని పాట్లు పడాల్సి వచ్చిందో చెబుతూ ఓ భారతీయ యువకుడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వరల్డ్ బ్యాంక్‌లో(Worldbank) తనకు జాబ్ ఎలా వచ్చిందో చెబుతూ వత్సల్ నహాతా(Vatsal Nahata).. లింక్డ్‌ఇన్‌లో(LinkedIn) ఓ పోస్ట్ పెట్టాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అతడి పోస్టుకు ఏకంగా 15000కు పైగా లైకులు వచ్చి పడ్డాయి. 


మరో రెండు నెలల్లో చదువు పూర్తవుతుందనంగా చిక్కులు.. 

అది 2020. అప్పట్లో వత్సల్.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటున్నాడు. మరో రెండు నెలల్లో అతడి యూనివర్శిటీ చదువు పూర్తి కానుంది. అది కరోనా గుడ్లురుముతున్న సమయం. అలాంటి టైంలో వత్సల్ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ సమయంలో.. ఆర్థిక ఒడిదుడుకులు తప్పవన్న అంచనాల నడుమ కంపెనీలు ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండేవని వత్సల్ చెప్పుకొచ్చాడు. ‘‘అప్పట్లో నా చేతిలో ఒక్క జాబ్ ఆఫర్ కూడా లేదు. మరో రెండు నెలల్లో చదువు పూర్తి కానుంది. నేనేమో ప్రఖ్యాత యేల్ యూనివర్శిటీ విద్యార్థిని. ఒక్క జాబ్ కూడా సంపాదించలేకపోతే ఇక్కడికొచ్చి ఉపయోగమేముందని అనుకునేవాడిని. అమ్మానాన్నలు నాకు ఫోన్ చేసినప్పుడల్లా ఏం చెప్పాలో తోచేదికాదు. నాలోని బేలతనం బయటపడిపోయేది.  కానీ.. జాబ్ లేకుండా ఇండియాకు తిరిగిరావద్దని ఖచ్చితంగా నిర్ణయించుకున్నా. నా తొలి జీతం డాలర్లలోనే తీసుకోవాలని డిసైడయ్యా. వెంటనే రంగంలోకి దిగా.. నెట్వర్కింగ్ మొదలెట్టి.. పరిచయాలు పెంచుకున్నా. జాబ్ పోర్టల్‌లలో ఒక్క రెజ్యూమే కూడా అప్‌లోడ్ చేయవద్దనుకున్నా.. అది చాలా రిస్కీ నిర్ణయం’’ అని వత్సల్ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. 


ఆ తరువాత.. అతడు రెండు నెలల పాటు దాదాపు 1500 మందికి కనెక్షన్ రిక్వస్ట్‌లు పంపించాడు. 600 పైగా ఈ మెయిల్స్, 80 పైగా ఫోన్ కాల్స్ చేశాడు. కానీ.. లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు. అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘‘అలా వందల కొద్దీ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఓ రోజు నేను కోరుకున్నది ఎట్టకేలకు జరిగింది. మే మొదటి వారానికల్లా నా చేతిలో నాలుగు జాబ్ ఆఫర్లు వచ్చిపడ్డాయి. చివరకు నేను వరల్డ్ బ్యాంక్‌ను ఎంచుకున్నా’’ అని వత్సల్ పేర్కొన్నాడు. 


తన ఓపీటీ(OPT) పూర్తయ్యాక వీసా స్పాన్సర్ చేసేందుకు కూడా వరల్డ్ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. మెషిన్ లర్నింగ్‌ అంశంలో వత్సల్ రాసిన పరిశోధన పత్రానికి కో ఆథర్‌గా ఉండేందుకు వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ముందుకొచ్చారట. కేవలం 23 ఏళ్ల వయసున్న యువకుడికి ఇలాంటి ఆఫర్ రావడం చాలా అరుదు అని కూడా వత్సల్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.  ఆ క్లిష్ట సమయం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాడు. ‘‘నెట్‌వర్కింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో నాకు తెలిసొచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలనన్న ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. అంతేకాదు.. ఎంతగొప్ప కాలేజీ డిగ్రీకి అయినా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి..  ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా ఓటమిని అంగీకరించొద్దని చెప్పేందుకే నేను ఈ పోస్ట్ పెట్టా. చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. విజయం వరిస్తుంది.. బెస్ట్ ఆఫ్ లక్ ’’ అంటూ వత్సల్ తన పోస్ట్‌ను ముగించాడు. అన్నట్టు వత్సల్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందాడు. 



Updated Date - 2022-09-26T23:33:06+05:30 IST