UAE Residency Visa: 6నెలలకు పైగా దేశం వెలుపల ఉన్న రెసిడెంట్స్‌కు యూఏఈ గుడ్‌న్యూస్..

ABN , First Publish Date - 2022-12-10T08:05:27+05:30 IST

చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు ఇతర దేశాలకు వెళ్తే ఆరు నెలలకు మించి యూఏఈ బయట ఉండరాదు.

UAE Residency Visa: 6నెలలకు పైగా దేశం వెలుపల ఉన్న రెసిడెంట్స్‌కు యూఏఈ గుడ్‌న్యూస్..

అబుదాబి: చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు ఇతర దేశాలకు వెళ్తే ఆరు నెలలకు మించి యూఏఈ బయట ఉండరాదు. అలా ఉంటే వారి వీసా ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. వారికి తిరిగి యూఏఈలో ప్రవేశానికి అనుమతి ఉండదు. మళ్లీ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎమిరేట్స్ డిజిటల్ గవర్నమెంట్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వలసదారులకు ఇంతకుముందు ఆరు మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అదనంగా మరో ఐదు మినహాయింపులు జోడించింది. ఈ 11 మినహాయింపులతో వాలీడ్ రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు ఆరు నెలలకు పైగా విదేశాల్లో ఉన్నా కూడా తిరిగి యూఏఈ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) తాజాగా ఈ మినహాయింపుల జాబితాను అప్‌డేట్ చేసింది. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం..

* ఎమిరటీ భర్త స్పాన్సర్ చేసే విదేశీ భార్య

* తన యజమాని ద్వారా చికిత్స కోసం విదేశాలకు పంపబడే ప్రభుత్వ సంస్థ కార్మికులు(అయితే, చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన కార్మికుడు/కార్మికురాలు ఆరోగ్యశాఖ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన హెల్త్ అథారిటీ ఆమోదం పొందిన మెడికల్ రిపోర్టు సమర్పించడం తప్పనిసరి.)

* విదేశాల్లో చదువుతున్న విద్యార్థి లేదా విదేశాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తితో పాటు గృహ కార్మికులు

* విదేశాలలో యూఏఈకి ప్రాతినిధ్యం వహించే దౌత్య, కాన్సులర్ మిషన్‌ల సభ్యులతో పాటు గృహ కార్మికులు

* యూఏఈలో రెసిడెన్సీ వీసా కలిగి ఉన్న ఈ మిషన్‌ల ఉద్యోగులు

* శిక్షణ లేదా ప్రత్యేక కోర్సుల కోసం వారి యజమాని పంపిన ప్రభుత్వరంగ ఉద్యోగులు

* విదేశాల్లోని యజమానుల కార్యాలయాల ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు

* విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విదేశాలకు వెళ్లే రెసిడెంట్ స్టూడెంట్

* విదేశాలలో రాజ కుటుంబీకుల ఇళ్లలో పనిచేస్తున్న పాలక కుటుంబాల సభ్యుల గృహ సహాయకులు

* యూఏఈ దౌత్య, కాన్సులర్ ప్రతినిధులచే స్పాన్సర్ చేయబడిన నివాసితులు, వారిపై ఆధారపడి ఉండే ఫ్యామిలీ మెంబర్స్

Updated Date - 2022-12-10T08:13:52+05:30 IST